డెత్! ది లెవెలర్!(Death the leveller)

Share Button

 

                                                      డెత్! ది లెవెలర్!
                                         (18-10-1974, ఆంధ్రజ్యోతి)


వర్షం! వర్షం!
ఆకాశానికీ, భూమికీ మధ్య నీరుతప్ప మరేమీ లేనట్లు ఏకధారగా వర్షం!
ప్రపంచాన్నంతటినీ ముంచేయాలన్నంత ఆత్రంగా కురుస్తోంది వర్షం! నట్టనడి సముద్రంలో… ఉధృతమైన తుఫాన్లో ఒంటరిగా పయనించే పడవలాగుంది ఆ ఇల్లు.
పెచ్చులూడిపోయిన గోడలు… అక్కడక్కడ విరిగిపోయిన పెంకులు… మృత్యుదేవత కబళించబోయే ముసలిదానిలా ఉందా ఇల్లు!
మనుష్యులు ఆ ఇంటిని వెలివేసి కొన్ని పదుల సంవత్సరాలు దాటాయని ఆ ఇంటి ముందు పిచ్చిగా పెరిగిన ముళ్ళమొక్కలే చెపుతున్నాయి. ఆ ఇంట్లో… ఆ గదిలో… ఆ ముగ్గురు…
మిట్ట మధ్యాహ్నం రెండుగంటల సమయం. కానీ ఆ గదిలో చీకటి. బయటనుండి వచ్చిన వారికి ఆ ముగ్గురూ గాలిలో తేలిపోతున్న నీడల్లా కనిపిస్తారు.
కత్తి ఝుళిపించినట్లు మెరుపు మెరిసింది. ఆ ఒక్క క్షణంలో ముగ్గురూ ఒకరి నొకరు నిశితంగా చూసుకొన్నారు.
ఆ చూపుల్లో భయం… ఏదో చెప్పాలన్న ఆతృత… నిరాశ…విసుగు… ఎన్నో కలగా పులగ మయిపోయాయి.
మెరుపుతోబాటు ఉరుము!
ఏదో అదృశ్యహస్తం ఆకాశాన్నీ భూమినీ పిడికిట్లో బంధించి పటపటమని విరిచేస్తున్నట్లు శబ్దం!
ఆ చప్పడుతో ఆ ముగ్గురితో పాటు ఆ ఇల్లు, ఆ ఇంటిముందున్న మర్రిచెట్టు అదిరి పోయాయి.
ఆ ముగుర్లో మూలనున్న కిటికీలో రుమాలు పరుచుకొని దాని మీద ఠీవిగా కూర్చొన్నతని పేరు లక్ష్మీపతి. ఖరీదైన సూటు, చేతికున్న వజ్రపుపొడి ఉంగరం, చీకట్లో మెరుస్తున్న రేడియం డయల్ వాచి సమాజంలో అతనికున్న స్థానాన్ని తెలుపకనే తెలుపుతున్నాయి. కాని ప్రస్తుతం ఆ గదిలో… ఆ వర్షంలో… అతని విలువ ఒక మనిషిగా మాత్రమే!
అటువైపు మూలకి గోడకి ఆనుకొనీ ఆనుకోనట్లుగా నిలబడి, చేతులు రెండూ వెనక్కు పెట్టుకొని వర్షంలోకి తదేకంగా చూస్తున్నతని పేరు సుబ్బారావు. అతని కళ్ళు వర్షం వైపు చూస్తున్నా ఆ చూపులు వర్షపు ధారలను చీల్చుకొని ఏ దూర తీరాలకో చొచ్చుకుపోతున్నాయి. వేసుకొన్న నీలంరంగు పేంటుకి ఒక చిరుగు కనపడకుండా కుట్టిఉంది. కాళ్ళకున్న చెప్పలు సగం అరిగిపోయి వాటి వయస్సుని దీనంగా చాటి చెపుతున్నాయి. సమాజంలో అతన్ని మధ్య తరగతి కుటుంబీకుడంటారు.
సరిగ్గా ఆ గదిలో ద్వారాని కెదురుగా మోకాళ్ళలో తలదూర్చుకొని కదలిక అనేది లేకుండా కూర్చున్నతని పేరు ఎల్లయ్య. ఎవరైనా అతన్ని అలా చూస్తే వెక్కివెక్కి ఏడుస్తున్నాడనుకొనే అవకాశాలున్నాయి. కానీ అతనేడవక పోయినా మనస్సులో కూడా బయటలాగే తుఫాను రేగుతోందని అతని కళ్ళలోకి చూసిన వారికి తెలిసి పోతుంది. అతను కట్టుకొన్న గోచీ మోకాళ్ళ పైకి ఉంది. పైన ఒక చిన్న తుండుగుడ్డ తప్ప మరే ఆఛ్ఛాదనా లేదు. శరీరం మీద అక్కడక్కడ నీటి బొట్లు మెరుపు మెరిసినప్పడల్లా తళుక్కుమంటున్నాయి. కార్లలో తిరిగే పెద్ద మనుష్యులు అతనికి ముద్దుగా పెట్టిన పేరు అలగా జాతివాడు.
“ధనాధన్. ధన్ ధన్ ధన్” భూమి గిరగిరా తిరుగుతూ వెళ్ళి ఏదో గ్రహానికి గుద్దుకొన్నంత చప్పుడు. ముగ్గురూ ఉలిక్కిపడ్డారు.
లక్ష్మీపతి కిటికీలోంచి లేచాడు. ఒకడుగు ముందుకు వేశాడు. సుబ్బారావు వైపు చూశాడు.సుబ్బారావు వర్షంలోంచిచూపు మరల్చి లక్ష్మీపతివైపు చూడబోయి, చటుక్కున చూపు తిప్పేసి ఎల్లయ్య వైపు చూశాడు.
ఉరుము ఉరమగానే ఉలిక్కిపడిన ఎల్లయ్య మోకాళ్ళలో దూర్చిన తలను చటుక్కున పైకెత్తి ఎర్రటి కళ్ళతో ఇద్దరివైపు నిశితంగా ఒక్క క్షణం చూసి మళ్ళా తలవంచేసుకున్నాడు.
ముగ్గురికీ ఏదో చెప్పాలన్న ఆతృత. ఇంకొకరికి దగ్గరవుదామన్న కోరిక. కాని అలా చెయ్యలేని ఆశక్తత!
లక్ష్మీపతికి సుబ్బారావు స్థితిని చూస్తే చులకన. ఎల్లయ్య కండబలాన్ని చూస్తే భయం.
సుబ్బారావుకి లక్ష్మీపతి ఖరీదుని చూస్తే కసి. ఎల్లయ్య వేషాన్ని చూస్తే అసహ్యం. ఎల్లయ్యకు లక్ష్మిపతి మొహాన్ని చూస్తే భయం. సుబ్బారావు దుస్తుల్ని చూస్తే అసూయ!
ఆపద వచ్చినప్పడు పామూ, మనిషీ కూడా ఏకమవుతారన్న వాడెవడో?
నిజమే పామునీ, మనిషినీ ఏకం చేసిన పరిస్థితులు కూడా మనిషికీ మనిషికీ మధ్యనున్న అంతస్థుల గోడల్ని ఛేదించలేవేమో!
కుండపోతగా కురిసే వర్షంలో. ఆ పాడుబడిన ఇంట్లో తలదాచుకొన్న…. ఆ ముగ్గురికీ అప్పుడూ అంతస్తుల గోడలు అడ్డొచ్చాయంటే ఆ మనుష్యుల్ని సృష్టించిన దేముడే పైనించి చూసి ఫక్కుమని నవ్వుకొంటాడేమో!
**** ***** **** **** **** **** **** **** **** **** **** **** ***
లక్ష్మీపతి మళ్ళీ కిటికీలో సర్దుకొని కూర్చున్నాడు. బయట స్కూటరు తడిసి ముద్దయిపోతోంది.
“ప్చ్ ! ఒక్క పావుగంట ముందు బయల్దేరినా హాయిగా ఈ సరికి ఆ ఇంట్లో ఉండేవాడిని” అనుకొన్నాడు సున్నితంగా మొహంమీది తడిని అద్దుకొంటూ. చూసీచూడనట్లు మిగిలిన ఇద్దరివైపూ చూశాడు.
“వారిద్దరితో కలిసి ఉన్న ఆ పాడు పడిన ఇల్లు అతనికి నరక కూపంలా కనిపించింది. వారిద్దరికీ బదులు తన అరుణే ఇక్కడుంటే ఓహ్! అది స్వర్గమే కాదూ ! అవును. బయట వెండి తీగల్లా వర్షపు ధారలు. లోపల ఒంటికి అతుక్కుపోయిన బట్టల్లో గులాబీ లాంటి మొహం మీద నిల్చిన నీటి బిందువుల్తో తన కౌగిట్లో ఒదిగిపోయిన అరుణ!
లోపల సెగలు రగిలించే వేడి. బయట జివ్వుమనిపించే చలి. “అబ్బా ఏం చేస్తున్నావరుణా ! తెల్లని ఉల్లి పొరలాటి చీరలో మెత్తని పరుపు మీద అలవోకగా పడుక్కొని వర్షపు ధారలవైపు పరధ్యానంగా చూస్తున్నావా? ఎప్పటికీ రాని నీ ప్రియుని మీది అలుకతో నీ అందాల పాదాలు కందిపోయేటట్టు పచార్లు చేస్తున్నావా?ఉహూC. ఒద్దు నిరీక్షణలో అలసిన నీ మొహాన్ని చూడలేను … వచ్చేయ్ అరుణా! ఇక్కడి కొచ్చేయ్! మై హనీ! మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్” !.
**** ***** **** **** **** **** **** **** **** **** *** ****
సుబ్బారావు తాను నిల్చొన్న దగ్గర్నుండి రెండడుగులు ముందుకు వేసి బయటకు చూశాడు. గాలివానకి అక్కడున్న సైకిల్ ఎప్పడో తిరగబడిపోయినట్లుంది. అద్దె సైకిల్ కూడానూ. ఏదైనా పాడయితే పీకల మీద కూర్చొంటాడు వెధవ …పోనీ కిందికి దిగివెళ్ళి తెచ్చేస్తే?. కాని ఈ ఈదురు గాలిలో పదిమెట్ల పైకి ఎక్కించి తీసుకురావడం సాధ్యమా? నిర్లిప్తంగా వెనక్కువచ్చి తన స్థానంలో నిల్చొన్నాడు.
ఇంట్లో జానకి ఏం చేస్తోందో ఇవాళే పథ్యం తింది కూడానూ. మళ్ళా ఈ వర్షానికి ఏమైనా వస్తే!. చూరులోంచి కారే నీళ్ళధారలకింద బిందెలూ, గిన్నెలూ పెడుతూ నీరసంగా చేయలేక చేయలేక చేస్తున్న పన్లకి అడ్డం వస్తున్న పిల్లవెధవల్ని దబ దబా బాదేస్తూ…ప్చ్!
“ఒద్దు జానకీ. ఒద్దు అలా విసుగ్గా చూడకు. నీ కళ్ళలో ఆ నిరాశని, విసుగుని భరించే శక్తి నాకు లేదు.
లేదు జానకీ! తప్పంతా నాదే! మూడు రోజులు జ్వరంతో పడిఉన్న పెళ్ళానికి లంఖణాన్నే ఔషధంగా ఇవ్వగలిగాను. నా పిచ్చి జానకీ! ఇక్కడి కొచ్చేయ్. ఇక్కడ కూడా పైనుంచినీళ్ళు కారుతున్నాయి. కాని ఆ పాడు ప్రపంచానికి దూరంగా మనమంతా హాయిగా పడుకోవచ్చు. వచ్చేయ్!”
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
ఎల్లయ్య ఏదో గుర్తొచ్చినవాడిలా లేచి నిల్చొని ద్వారందాకా వెళ్ళి బయటకు చూపుసారించాడు. వర్షంలో జలకాలాడుతూ నిశ్చలంగా నిలిచిఉంది సైకిల్ రిక్షా!
“ఇయాల అద్దెడబ్బులన్నా కిట్టయేమో! ఏం బతుకులో మాయదారి బతుకులు. పూట తిండిక్కూడా గతిలేని మాలాటోళ్ళని చూస్తే ఆ బగమంతుడిక్కూడా లోకువే. అతని కళ్ళలో లచ్చిరూపు మెదిలింది. . ఈ వర్షంలో ఎలాగుందో ఏం చేస్తోందో వర్షంలో తడిసిపోతూ . కాళ్ళకు అడ్డం పడుతున్న చీరనూ. చంకలో జారిపోతున్న బిడ్డనూ సవరించుకొంటూ పరిగెడుతున్న లచ్చి! ఏదో ఇంటి అరుగుమీద. సగం తడిసిపోతూ.. పసివాడిని గుండెలకు హత్తుకొని కళ్ళలో నీటిబొట్లతో ముడుచుకు కూర్చొన్న లచ్చి!
“లచ్చీ నా లచ్చీ? ఏం చేతున్నావే! నువ్వాడ .నేనేమో ఈడ! మన దౌర్బాగ్గిపు బతుకులు చూసి ఎకెక్కి ఏడుత్తున్నావా? ఒద్దు లచ్చీ అలా ఏడవమాకు. నీకు తెల్దా. నీ ఒక్కో కన్నీటిబొట్టు నా గుండెల్లో ఒక్కొక్క గునపంగా దిగుతాదని! రాయే లచ్చీ. నాకు నీవు .నేను నీకు. ఇంకేటీ ఒద్దు రాయే!
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
సెకండ్లు నిమిషాలుగా … నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయ్. కాని వారి ముగ్గురికి మాత్రం కాలం స్థంభించింది. చలికి ఆ ముగ్గురూ ఒణుకుతున్నారు. ఒణుకుతున్నవారిని చూసి ఆ ఇల్లు కూడా భయంతో ఒణుకుతోంది. ఆ చీకటి ఇంట్లో తలదాచుకొన్న ఆ మానవుల్ని చూసి వెర్రిగా నవ్వుతున్నట్లు విపరీతంగా ఊగుతోంది మర్రిచెట్టు. ఆ మర్రిచెట్టు ఊడలు ఎప్పడెప్పడు తమని కబళిద్దామా అని చూస్తున్న మృత్యుదేవత కబంధ హస్తాల్లా ఉన్నాయి.
లక్ష్మీపతి మనస్సులో కోరికలు బుసలు కొడుతున్నాయి.
సుబ్బారావు మనస్సులో నిరాశ నిద్ర తీస్తోంది.
ఎల్లయ్య మనస్సులో దు:ఖం కట్టలు తెంచుకొంటోంది.
కాని ముగ్గురు మనుష్యుల్లోనూ అట్టడుగున దాగివున్న భయం అప్పడప్పుడు నిద్రలేచి వికటహాసం చేస్తోంది.
లక్ష్మీపతికి అందమైన అరుణతోబాటు నిన్నటి సంఘటన కూడా గుర్తొచ్చింది.
“పతీ ఒక విషయం అడగనా!”
“అడుగు డార్లింగ్”.
“నా సర్వస్వాన్ని నీకర్పించాను. కాని అప్పడప్పుడు నువ్విచ్చే బహుమతులు తప్ప నాకై నేను నోరు విడిచి ఏదీ అడగలేదు. అవునా?”
“చెప్పరుణా ఈ అందచందాలన్నీ నావి కావడానికి ఏమైనా ఇచ్చేస్తాను.”
“నాకు తెలుసు పతీ నేనడిగింది కాదనవని . ఎందరికో నా శరీరాన్ని అర్పించినా వాళ్ళిచ్చిన డబ్బు నాకు తృణప్రాయం తెలుసా! నీ చేత్తో నేను కోరే ఈ చిన్న బహుమతి ఇస్తే నేనెప్పటికీ నీదాన్నే! ఈ శరీరాన్ని ఇంకొకరు తాకరు!”
“ఇంక ఆ ఊరింపు చాలించి చెప్పు!”
“వీరభద్రయ్యగారి ఇల్లు అమ్మకానికొచ్చిందని నీకూ తెలుసుగా! ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది అటువంటి ఇంట్లో ఉండాలని. చుట్టూ కాంపౌండ్, ముందొక గారేజ్. అటాచ్ బాత్రూం. చాలా బాగుందిలే నేనూ చూశా!”
“ఎంతుంటుందో”
“నలభైవేలట! వెధవ ఆ నలభై వేలు నీకు లెక్కలోనివి కావని తెలుసు”
“ఏమిటాలోచిస్తున్నావ్ పతీ! ఆ ఇంటిని ఎంత త్వరలో కొనేసి నన్ను ఆశ్చర్యంలో ముంచేద్దామా అని కదూ!”
“అంత పరధ్యానంగా ఉండకు మరి! కమాన్ ముందుగా డ్రింక్ తీసుకో!” లక్ష్మీపతి ఆలోచనల్లోంచీ తేరుకొన్నాడు.
“అవును ఆ ఇల్లు కొనాలి. ఊరంతటినీ ఊరించిన చిలకని శాశ్వతంగా తన గూట్లోనే బంధించాలి.”
లక్ష్మీపతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.
రేపు . అతనికి రంగురంగుల ఇంద్ర ధనుస్సులా కనిపించింది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
సుబ్బారావుకి విసుగ్గా కోపంగా ఉన్న జానకి ముఖం కళ్ళ ముందు నిలిచింది. ఆ వెనకే నిన్నటి సంఘటన కూడా. “అబ్బబ్బ వెధవ ఇల్లు . వెధవ పిల్లలు. ఛస్తున్నాను చాకిరీ చెయ్యలేక!”
“ఏమిటే నీ గొణుగుడు ఆఫీస్ నుంచి వచ్చిన ప్రాణాన్ని హాయిగా వుండనీయక”
“అవునవును. మీరు హాయిగా ఆ కుర్చీలో అలాగే కూర్చోండి. నేనేమో అరమైలు దూరం నుండి నీళ్ళు మోసుకొస్తూ. ఆ బిందెడు నీళ్ళక్కూడా అడ్డమైన వాళ్ళచేత తిట్ల తింటూ.. ఛీఛీ! ఈ బతుకు బతికేకంటే ఆ నూతిలో పడి ఛస్తే మీకు నాబాధ. నాకు మీ బాధ తప్పుతాయి”
“నోర్ముయ్యవే! మాట్లాడితే ఛస్తాను ఛస్తాను అంటూ.. ఇంట్లోవున్న ఈ నాలుగ్గంటలైనా హాయిగా వుండనీయకుండా.”
“అవునవును మీకే కావాలి హాయి. మీ పెళ్ళాని కక్కర్లేదు. వెధవది స్నానాలు చేయ్యాలంటే బాత్రూం ముందు గంటలకొద్ది పడిగాపులు . దెబ్బలాటలు. చేతులు పడిపోయేటట్లు నీళ్ళు తోడుకోవాలి. పదిమంది కుటుంబాలకు ఒక్క బావి! వీటన్నిటితోనూ నేను ఇరవై నాలుగ్గంటలూ చావాలి. కాని తమరు మాత్రం మహారాజులా కాలుమీద కాలేసుకు కూర్చోవాలి!”
“అబ్బబ్బాఏం చేయమంటావే నన్ను? రేపటినుంచి బిందెల్లో నీళ్లు మోసుకురానా, బావిలోంచి నీళ్ళు తోడిపెట్టనా!”
“మీరవేమీ చెయ్యక్కర్లే. ఇంత కంటే మంచి కొంపొకటి చూసి పెట్టండిచాలు. అక్కడెక్కడో లక్ష్మీటాకీస్ దగ్గర ఓ ఇల్లు ఖాళీ అయ్యిందట. ఇంట్లోనే ఓ కొళాయి, బాత్రూము ఉన్నాయట. ఈ దరిద్రపు కొంప పీడ విరగడయితే చాలు. పది రూపాయలద్దె ఎక్కువైతే నేం. రోజూ ఛస్తూ బతికేకంటే నయం కాదూ!”
“సరేలేవే రేపే వెళ్ళి కనుక్కుంటాన్లే”
ఈ లోకంలోకి మళ్ళా వచ్చాడు సుబ్బారావు. “ఈ వానింకా తగ్గలేదు. ఈ పాటికి ఇంకెవరైనా మాట్లాడేసి అడ్వాన్సు ఇచ్చేశారేమో! “ఈ వర్షం వల్ల ఆ ఇల్లు కూడా దక్కేట్టులేదు.”
సుబ్బారావు దీర్ఘంగా నిట్టూర్చాడు. రేపు… అతనికి మబ్బులు కమ్మిన ఆకాశంలా కనిపించింది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** ***
లచ్చి అమాయికమైన మొహం ఎల్లయ్యకు నిన్నటి సంఘటన గుర్తుకు తెచ్చింది.
“మావా!” లచ్చి తన గుండెల్లో తలపెట్టి భోరున ఏడుస్తోంది.
“ఎట్టా మావా! నిన్నటిదాకా వుండడానికి ఒక గూడన్నా వుండేది. ఇప్పడు అదీ లేదు. ఆ వానదేముడిక్కూడా మనమంటే ఏలాకోలమే మావా! లేకపోతే మన గుడిసెనే కూల్చెయ్యాలా… సెప్పు ఛీ మాయదారి దేవుడు.”
“తప్పే లచ్చీ ఆ భగవంతుడ్ని తిట్టమాకే .. మన కర్మకాలి మన గుడిసె కూల్తే ఆ దేవుడేం చేత్తాడే … ఊరుకోయే… ఊరుకో… ఏడవమాక!”
“ఏడవక ఏం సెయ్యనుమావా! ఈ బొట్టడ్ని సూడు… మనిద్దరమైతే ఎండలో ఎండుతాం… వానలో తడుత్తాం… ఇంకా కళ్ళైనా సరిగ్గా తెరవనేదు. ఈడి కెట్టామావా!”
“ఆ దేవుడే మనకు దారి చూపిత్తాడులెయ్యే! ఆ లచ్చయ్యని వంద రూపాయలు
అప్పు అడుగుతా… ఈ రిచ్చాలో బొట్టడ్ని పడుకోబెట్టు… రెండు రోజుల్లో గుడిసె ఏసుకుందాం.”
వానధారల్లా పడుతూనే వుంది… ఎల్లయ్యని ఆలోకంలోంచి ఈ లోకంలోకి లాక్కొచ్చింది.
“ఆ లచ్చయ్య డబ్బిత్తాడో ఇయ్యడో…ఎన్ని తిప్పలు పెడతాడో… ప్చ్! మా లాటోళ్ల బతుకులింతే.”
ఎల్లయ్య కంటిలోంచి రెండుకన్నీటి బొట్లు జారిపడ్డాయి. రేపు… అతనికి కటిక చీకటి ఆవరించిన కాళరాత్రిలా అనిపించింది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
కాలచక్రం ఆగకుండా తిరుగుతూనే వుంది.
“అబ్బ నాలుగ్గంటలు ఈ ఇంట్లో గడిపాను” అనుకొన్నాడు లక్ష్మీపతి చేతినున్న వాచీ చూసుకొంటూ… చీకట్లో వాచీ కనిపించని సుబ్బారావు లక్ష్మీపతివైపు కసిగా చూశాడు. అసలు టైము చూడడమే రాని ఎల్లయ్య మాత్రం మోకాళ్ళలోంచి తల పైకెత్తలేదు.
గదిలో చీకటి చిక్కబడుతోంది… సూర్యుడు ఎప్పడు పడమటి కొండలచాటుకి వెళ్ళాడో తెలియనంతగా మబ్బులు కమ్మేశాయి… చల్లని చీరచెంగు ముఖం నిండుగా కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆడదానిలా ఉంది ఆకాశం!
వర్షం… కాదు కాదు జడివాన… ఉహూ! తుఫాను! ఇవేమీ కాదు… ఇది ప్రళయం… జలప్రళయం…
ముగ్గురి గుండెల్లోనూ గూడు కట్టుకొన్న భయం ఉబికుబికి బయటకొస్తోంది… నల్లని జుత్తు ముఖాన్నంతా కప్పేసినట్లు చీకటి ఆ గదిని పూర్తిగా ఆక్రమించుకొంది.
లక్ష్మీపతి జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించాడు. ఆ చీకట్లో ఆ నిప్పురవ్వ చిన్న ఆశాకిరణంలా మినుకు మినుకు మంటోంది.
సుబ్బారావు కూడా జేబులో ఉన్న ఒక్కసిగరెట్టూ తీశాడు. కానీ వెంటనే అగ్గిపెట్టెలో పుల్లల్లేవన్న సంగతి గుర్తొచ్చి కసిగా జేబులో పడేశాడు. లక్ష్మీపతిని అగ్గిపుల్ల అడగడానికి సంకోచం. ఎల్లయ్య నడగడానికి అహం అడ్డొచ్చాయి.
ఎల్లయ్య కసలు జేబూలేదు… మొలలో చుట్టపీకా లేదు… హోరు మంటున్న వర్షంలో… ఇంటిచుట్టూ ఉన్న నీటిలో కప్పల బెకబెకలు… యమదూతల కిచకిచ నవ్వుల్లా… ముగ్గురి మనస్సుల్లోనూ ఏదో విచిత్రమైన అనుభూతి…
తామున్న ఈ గది తప్ప మిగతా ప్రపంచమంతా ముక్కలు ముక్కలై నీటిలో తేలిపోతోంది… సూర్యుడు లేడు… చంద్రుడు లేడు… భూమి లేదు… అంతా నీరు… నీరు… నీరు… మామూలు నీరు కాదు… నల్లని చిక్కని నీరు! ఆ నీటిలో తాము ఎక్కడికో తేలిపోతున్నారు. గుండెల నిండా నిండిన ఆ అనుభూతి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** **** ***


“ఢాం” భూమి బద్దలయినట్లుగా శబ్దం! కాని అది పిడుగో మరో శబ్దమో తెలుసుకొనే వ్యవధి వారికి లేకపోయింది.
ఎందుకంటే… .
వందల సంవత్సరాల వయస్సున్న ఆ మర్రిచెట్టు తన ప్రాణంతో పాటు వారి ముగ్గురివీ కూడా తీసుకోదల్చి ఆ ఇంటిమీద పడి శాశ్వతంగా విశ్రాంతి తీసుకొంది.
ముందు క్షణం దాకా… లక్ష్మీపతికి చుట్టూ కాంపౌండ్ తో ముందు గారేజ్ తో ఉన్న అందమైన ఇల్లు కావాలి! సుబ్బారావుకి ఒక కొళాయి, ఒక బాత్రూం ఉన్న చిన్న కొంప కావాలి! ఎల్లయ్యకు తల దాచుకొనేందుకు కొక గుడిసె కావాలి! కాని ఈ క్షణం మాత్రం…..
ఒక్కొక్కరికి మూడేసి గజాల చోటు చాలు రేపటి గురించి కలలుగన్నవారికి తెలియని దొక్కటే మృత్యుదేవత దృష్టిలో అందరూ సమానులేనని!
                                                            *********

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *