వెన్నెల నీడలు

Share Button

(ఈ కధ యువ సెప్టెంబరు 1987 లో ప్రచురింప బడింది)

వెన్నెల నీడలు…. ఎంతందంగా ఉన్నాయో, ఎంత మత్తుగా ఉన్నాయో! వాటిని చూస్తుంటే ఎందుకో దిగులేస్తోంది.. .. మనస్సులో మరెందుకో గుబులేస్తోంది. ఎందుకో తెలియడంలేదు పదారేళ్ళ సుందరికి. పల్లెటూరి ముద్దమందారానికి. అర్ధరాత్రి మిద్దెమీదికి పాకిన మల్లెతీగ పక్కన నిల్చొని పిట్టగోడ మీద మోచేతులాన్చి ఒంగొని చూస్తోంది.
దీపాలార్పేసి ప్రపంచమంతా హాయిగా నిద్రాదేవి ఒడిలో బజ్జొంటే… వెన్నెల పాలజల్లుల్లో చెట్లూ, పుట్టలూ, కొండలూ, కోనలూ మాత్రం హాయిగా జలకాలాడేస్తున్నాయి. జలకాలాడేయడమే కాక తమ నీడల్ని చూసి తామే మెత్తగా నవ్వుకొంటున్నాయి.
పదేళ్ళపుడు పొట్టిగౌను తొడుక్కొని అమ్మమ్మకి పూజకి పూలు కోయడానికి ఊరవతల రాజావారి తోటవైపు పరుగు పరుగున వెళుతుంటే… ఒక్క క్షణం ఆగి బంగారు రంగు ఎండలో పొగడ పూలన్నీ జలజలా ఒంటినిండా రాలుతుంటే వింతగా… తీయగా… హాయిగా… అదోలా అనిపించింది.
అలాగే సాయంత్రమూనూ!
అప్పటినుండీ అది గుర్తొచ్చినపుడల్లా వేళ్ళకొసలు అలా కంపిస్తూనే ఉన్నాయి. ఆ ప్రకంపనాలు గుండెల్లోకి పాకి గుండె అలా బరువెక్కి పోతూనే ఉంది. నిన్న రాత్రి ఒక మల్లెమొగ్గ జారి డాబా మీది నుండి కింద పడిపోయింది.
ఆ మల్లెమొగ్గ వెళ్ళి అతని మీద పడిందేమో? నిద్రలోంచి లేచి అతను కళ్ళు తెరిచి డాబా మీదనున్న తనవైపు చూస్తున్నాడేమో.
అమ్మో! గబుక్కున వెనక్కుతిరిగి పిట్టగోడ కానుకొని కూర్చుండిపోయింది. తానెంత చెడ్డది! తనకెందుకిలా అయిపోతోంది?
చిన్నప్పుడే బావతో పెళ్ళి కుదిరిపోయి… రేపో ఎల్లుండో పెళ్ళి కూడా చేసేసుకోబోతూ… అతని గురించి… ఆ బావ స్నేహితుడి గురించి ఆలోచిస్తోందేమిటి తను? ఎందుకు అతను గుర్తొస్తే మనసు దిగులుగా గుబులుగా అవుతోంది? కాని ఆ మనసే ఆ దిగులూ గుబులూ ఇంకా ఇంకా కావాలంటోందెందుకని? ఎందుకు అతని మోహం గుర్తొస్తే గుండె తీయగా మూలుగుతోంది?
మధ్యాహ్నం తను పెరట్లో తిరుగుతున్నప్పుడు పండిన ఓ నిమ్మాకు ఠప్పుమని రాలి మెడమీద పడేసరికి అతనే వెనుక నించి ఏదో చిలిపిగా విసిరాడనుకొని ఉలిక్కిపడిందెందుకని? సాయంత్రం చీకటి పడే వేళ చెరువులో నీళ్ళు బిందెతో మంచుకోబోతూ పరధ్యానంగా బిందె ముంచేసరికి బుడుంగు మని చప్పుడైతే అతనే ఎక్కడినుండో వచ్చేసి నీళ్ళలోకి దూకాడేమోనని తడబాటుతో బిందెని నీళ్ళలోనే వదిలి వచ్చేయబోయిందెందుకని?
ఎవరు చెప్తారు తన ప్రశ్నలకి జవాబులు? ఎవరినడగాలి తన సందేహాలు? బావ నడగాలి ! అవును బావనే అడగాలి. బావంటే తన కెంత ఇష్టమో! చిన్నప్పటినుండి తనకేసందేహమొచ్చినా బావేగా జవాబు చెప్పేవాడు. బావ ఇప్పుడిక్కడికొస్తే బాగుండును. తన కొండంత దిగులూ చిటికెలో మాయమవుతుంది. పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చున్నంత హాయిగా ఉంటుంది. బావా! బావా! రావూ! మెట్లమీద అడుగుల చప్పుడవుతోంది. అతనయితే బాగుండును…కాదు కాదు… బావైతే బాగుండును…

డాబా ఆఖరి మెట్టు మీద నిల్చొని చూశాడు శేఖరం. మల్లెతీగ పక్కగా డాబామీద పిట్ట గోడనానుకొని మోకాళ్ళచుట్టూ చేతులు చుట్టి వాటిమీద తల ఆన్చి కూర్చొనుంది సుందూ!

బోలేడు కుచ్చిళ్ళు పోసి కుట్టిన పరికిణీ పాదాల చుట్టూ పరచుకొని ఉంది. పరికిణీ మీద అక్కడక్కడ కుట్టిన అద్దాలమీద వెన్నెల కాంతి పడి అవన్నీ చిన్నచిన్న చందమామల్లా ఉన్నాయి.

మోకాళ్ళమీద ఆన్చిన చిన్న మొహం చిన్న చిన్న చందమామల మధ్య కాస్త పెద్ద చందమామలా ఉంది. ముక్కుకి ఉన్న ఒంటి రాయి ముక్కుపుడక తళుక్కుమంటూ, చంద్రుడితో సరసమాడుతున్న తారకలా ఉంది.
“సుందూ!?” మార్ధవంగా పిలిచాడు.
“బావా నువ్వేనా” ఆ గొంతులో సంతోషం నిశ్చింత…
“ఇవాళింకా పడుకోలేదేం? నాకూ నిద్ర పట్టలేదు. ఇందాక నువ్వు పిట్టగోడమీంచి కిందికి చూడ్డం చూశాను. ఎందుకోనని ఇలా వచ్చాను” ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు.
“బావా!” ఏదో అసరాకోసమన్నట్టు అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆర్తిగా పిలిచింది.
“చెప్ప సుందూ” తన చేతిని సున్నితంగా విడిపించుకొని ఆ పచ్చని లేత చేతుల్ని తనచేతో మృదువుగా పట్టుకొని వాటివైపే మమకారంగా చూస్తూ అడిగాడు. పచ్చటి పొడుగాటి వేళ్ళకి ఎర్రగా పెట్టిన గోరింటాకు మెరుస్తోంది. లేత అరచేతిలో చిన్న చందమామా చుక్కలూ…
“బావా! మరే… మీ స్నేహితుడు ఎప్పడెళ్ళిపోతాడు?”
ఆమె చేతుల్ని పట్టుకొన్న అతని చేతులు అప్రయత్నంగా ఒదులయ్యాయి.
“ఎందుకు సుందూ అలా అడుగుతున్నావు? వాడేమైనా నిన్ను అల్లరి పెట్టాడా?” అతని గొంతు కంపించింది.
“వెటకారం చేసి ఏడిపించాడా?”
“లేదు… లేదు.” గబగబా తల అడ్డంగా ఊపింది.
లేదు…తను చెప్పలేదు…ఇంత మంచి బావకి తన మనస్సులోని చెడ్డ ఆలోచనలు చెప్పలేదు… చెప్తే ఒకవేళ తనను పెళ్లాడననేస్తే? అమ్మో బావలేకుండా తనుండగలదా?
“ఏమిటాలోచిస్తున్నావు? చెప్పరా పిచ్చీ.”
ఆ ఆప్యాయతకి అమె మనసులో దిగులు కన్నీళ్ళ రూపంలో బయటికొచ్చేసింది… అతని భుజం మీద తల ఆన్చి కన్నీళ్లతో అతని చొక్కా తడిపేస్తూ అంది…
“మనిద్దరికీ తొందరగా పెళ్ళిచేసేయమని అమ్మా వాళ్లతో చెప్పవూ?”
భుజం మీద ఆన్చిన ఆమె తలని పైకెత్తి ఆ కళ్లలోకి చూశాడు.
ఎంత నిర్మలంగా ఉన్నాయి ఆ కళ్ళు! సూటిగా ఆప్యాయంగా తన కళ్లలోకి చూస్తూ! పాపిటి మధ్యనుంచి చెదిరి నుదుటి మీద పడుతున్న ముంగురుల్ని తేలిగ్గా చుంబించాడు. అతని చేయి అప్రయత్నంగా ఆమె తలని లాలనగా నిమరసాగింది.
తల్లి ఒడిలో నిశ్చింతగా నిద్రపోతున్న పసిపిల్లలా కళ్లు మూసుకొంది సుందరి. పదహారేళ్ల ఈ చిన్నారి సుందులో ఎన్నెన్ని అందాలు చూశాడు తను…
“బావా ఇవాళ మా స్కూల్లో ఏమయిందో తెలుసా?” అంటూ చక్రాల్లాంటి కళ్ళు తిప్పుకుంటూ కబుర్లు చెపుతుంటే నక్షత్రాల్లా మెరుస్తున్న ఆ కళ్ళలోని మెరుపు తనలో నిద్రాణమై ఉన్న ఉత్సాహాన్ని తట్టి లేపేది.
“ఇంకొంచెం అన్నం వేసుకోకపోతే ఊరుకొనేది లేదు తెలుసా?” అంటూ ఊర్నించి వచ్చిన తనను చిరుకోపంతో కసురుకొంటూ కొసరికొసరి తినిపిస్తుంటే ఆ నిర్మలమైన నవ్వు తన పరీక్షల అలసటని ఇట్టే పోగొట్టేది.
“ఈసారి కూడా ఊర్నించి నిమ్మపండు రంగు నైలాను ఓణీ తేలేదు కదూ?” అంటూ కోపంతో ఎర్రబడ్డ సంపెంగ మొగ్గలాంటి ముక్కుని ఎగరేస్తుంటే మనసు చిలిపిదనంతో చిందులేసేది.
కానీ…కానీ… ఈ రోజు సాయంత్రం సుందూలో చూసిన అందాలు…
మణుగులకొద్ది బరువులు మోయలేక మోస్తున్నట్టు కిందికి వాలిన కనురెప్పలు…
రెప్పల చాటునించి వెన్నెల కురుస్తున్నట్టు కొస చూపులు…
మాట్లాడుతున్నపుడు మంచులో తడిసి చిరుగాలికి కంపిస్తున్నట్లున్న గులాబీ మొగ్గల్లాంటి తడి లేత పెదవులు… బరువైన నిశ్వాసాన్ని బిగపట్టి ఇక భరించలేనన్నట్టు చివర ఎర్రబడిన ముక్కు…
మాట్లాడుతున్నపుడు శృతి చేసిన వీణలా గొంతులో సన్నని జీర…
గిరుక్కున వెనక్కు తిరిగినప్పుడు పల్చని పైటచాటున ఎగసిపడే గుండెలు…
ఈ పదహారేళ్ళలోనూ చూడలేని అందాలు…
గుండెల్లో గుబులు రేపే అందాలు…
కాని…కాని… ఈ అందాలు తన స్వంతం కావు… తానామెను స్వంతం చేసుకొన్నా ఈ అందాలు మాత్రం ఎప్పటికీ తన స్వంతం కావు…
సుందూ కోసం సుందూ నుండి ఆ అందాల్ని దూరంచేయలేడు తను…
“మాట్లాడవేం బావా? అమ్మనీ నాన్ననీ అడుగుతావా మన పెళ్ళి గురించి?”

సాయంత్రం తన స్నేహితుడితో అతి సామాన్యమైన విషయాలు మాట్లాడుతున్నప్పటి ఆ స్వరానికి పెళ్ళిలాంటి అతి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నప్పటి ఈ స్వరానికి ఎంత తేడా!
ఆ గొంతు వింటుంటే అప్పుడే సరిగమలు నేర్చుకొంటున్న పసిపాప శృతిచేసిన కమ్మని వీణానాదంతో గొంతు కలపడానికి ప్రయత్నిస్తూ తన్మయురాలవుతున్న అనుభూతి…
ఈ గొంతు వింటూంటే ఏ వాయిద్యమూ లేకుండానే దివ్యగానాన్ని ఆలపిస్తున్న మహా గాయకురాలి గొంతులోని నిశ్చలత్వం…
ఎప్పటికైనా ఈ పసిపాప గొంతులోని సరిగమలు ఆ మధుర మంజుల వీణానాదంతో ఏకమై తేనెలు చిలికించవూ?
మరి ఏ నాదమూ పక్కన లేని గానమో? ఊహూ… వద్దు…
“సుందూ ఈ రోజు సాయంత్రం నువ్వు మా స్నేహితుడితో మాట్లాడుతున్నపుడు ఎంతందంగా ఉన్నావో తెలుసా?” మృదువుగా అడిగాడు…
“అంటే మరెప్పడూ అందంగా లేనా బావా?” అని ఎప్పట్లా చిలిపిగా అడగ లేదామె.
తెలిసిపోయింది. బావకి తెలిసిపోయింది అనుకొంటూ మోకాళ్ళలో తలదించుకొంది. దించిన ఆ తలని నిమురుతూ ఉండిపోయాయి అతని చేతులు.
“అలా సిగ్గుపడకురా సుందూ! తమ అందాల్ని చూసుకొని తామె సిగ్గుపడతారా ఎవరైనా? సుందూ ఈ అనురాగం ఆప్యాయతా నాకు చాలురా! ఎంత దూరంలో ఉన్నా అవి అందుకోగలన్నేను ఆ మన్మధబాణాలు అతనికే దక్కనీ. అది అందుకొనే అదృష్టం నాకెలాగూ లేదు. నా ఇంట్లో కరెంటు దీపం వెలిగించడం కోసం వెండి వెన్నెల్లోని హాయిని మాయం చెయ్యలేనురా….
ఈ మాటలన్నీ అతను పైకి చెప్పలేదు. చెప్పినా ఆ పదహారేళ్ళ ముగ్ధకి అర్థంకాదు. ఎంత సేపటికీ బావ మాట్లాడకపోయే సరికి మోకాళ్లలోంచి తలెత్తి చూసింది సుందరి. నిండు చందమామని తదేకంగా చూస్తున్నాడతను.
బావనలా ఎక్కువ సేపు చూడలేనట్టు నెమ్మదిగా లేచి నిలబడి కాలికున్న మువ్వలు చిరుసవ్వడి చేస్తుంటే నెమ్మదిగా నడుస్తూ వెళ్లి అమ్మమ్మ పక్కలో దూరిపోయింది.
వెన్నెల నీడలు…. ఎంతందంగా ఉన్నాయో, ఎంత మత్తుగా ఉన్నాయో! వాటిని చూస్తుంటే ఎందుకో దిగులేస్తోంది.. .. మనస్సులో మరెందుకో గుబులేస్తోంది..అతనికి!

(C): Avadhanula Vijaya Lakshmi

Share Button

8 thoughts on “వెన్నెల నీడలు”

  1. Amazing work ma’am. This is one of the best Telugu writings I have ever read. It’s so fine, I love how it shows the contrast in our thinking from 1987 -2017. Please keep updating the blog with more stories.

  2. Chaala baagundi attayya. Chakkani telugu padaalu. Telugu bhaasha entha andangaa vuntundi ilaantivi chaduvutunte artham avutundi. Inkonni kathalu pettagalarani aashistunnanu.

    1. నువ్వు చదివినందుకు సంతోషంగా ఉంది.తప్పకుండా అన్నీ పెడతాను నాగూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *