Paalaina Kaarave Bangaaru Kallu

Share Button

                                             
                       (స్వాతి నవరసముల కథల పోటీలో బహుమతి పొందిన కథ)                                                                      04.09.87 స్వాతి వార పత్రిక
“ఏడవకు ఏడవకు నా చిట్టి పాపా… ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు… నీలాలు గారితే నే చూడలేనూ… పాలైనా గారవే బంగారు కళ్ళూ…”
లోకం మీద ఇంత చీకటిని ఒంపేసి సూరీడు తనేమో హాయిగా ఆకాశం భూమి కలిసే సన్నని గీతకవతల హాయిగా విశ్రాంతి తీసుకొంటున్న వేళ… అసలే బరువుగా అలసటగా పడుతున్న అడుగులు… ఆ ఇంట్లోంచి దూరంగా గాలిలో తేలివస్తున్న ఆ పాట వినగానే మరింత బరువైయ్యాయి…
కాళ్ళలోకి ఎక్కడలేని నిస్సత్తువా వచ్చేసింది. ఒక్కో అడుగూ ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నకొద్దీ ఆ పాట… దానితో బాటు వినిపించే ఉయ్యాలకి కట్టిన మువ్వల చప్పుడూ దూరమవుతున్నాయి.
రోజులాగే అనుకొన్నాను “ఎంత అదృష్టవంతురాలు ఆ పాప!”
అవును మరి… సాయంత్రమయ్యేసరికల్లా అమ్మచేతి గోరుముద్దలు తినేసి… అమ్మ చేత కథలు చెప్పించుకొని… మువ్వలు కట్టిన ఉయ్యాల మంచంలో ఏ కలతలూ ఏ చికాకులు లేకుండా హాయిగా నిద్ర పోతూ…
ఆ తల్లో? ఆమె మాత్రం అదృష్టవంతురాలు కాదూ?
“అమ్మా ఈ రోజునువ్వు ఆఫీసు కెళ్ళద్దమ్మా” అంటూ మోకాళ్ళని చుట్టేసే చిట్టిచిట్టి చేతుల్ని బలవంతంగా విడిపించుకొని వెళ్ళక్కర్లేదు…
ఆఫీసులో క్షణం క్షణం ఆ చిట్టి చిట్టి చేతుల్నీ… ఆ పాల బుగ్గల్నీ తలచుకొంటూ బెంగతో గడపక్కర్లేదు…
ప్చ్! కాళ్ళదాకా కప్పుకుంటే తలకీ, తల దాకా కప్పుకుంటే కాళ్లకీ సరిపోని చిరుగుల దుప్పటి లాంటి జీవితం!
“పాలైన గారవే బంగారు కళ్ళూ.” గుర్తొస్తే చెవుల్లో గింగురుమంటున్న ఆ వాక్యం… మనసులో ఏదో బాధ… ఉండలు తిరిగి గొంతు కడ్డం పడేలా చేస్తోంది.
పొద్దున్న ఆఫీసుకి బయల్దేరి వెళ్ళే ముందు… అసలలా ఎలా చెయ్యగలిగాన్నేను?
విసురుగా తలుపు తీసుకొని వీధిలోకి నడుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి పాలబుగ్గల్ని కన్నీళ్ళతో తడిపేసుకొని కళ్ళింతింత చేసుకొని చూస్తూ కనబడిన బాబు మోహం ఆఫీసులో పనిచేస్తున్న ఎనిమిది గంటల్లోనూ మనసుని నులిమేస్తూనే ఉంది.
ఆ కళ్ళల్లో ఎంత దు:ఖం! దు:ఖం కంటే ఎక్కువగా ఎంత నిస్సహాయం!
అంతకంటే ఎక్కువగా ఎంత ఆశ్చర్యం!
“అమ్మేనా నన్ను కొట్టింది? అమ్మేనా నన్ను కొట్టి ఒక్క చిన్న ముద్దయినా ఇయ్యకుండా వెళ్ళిపోతోంది” – అని.
లేత తమలపాకుల్లాంటి బుగ్గల మీద తట్టతేలిన వేళ్ల గుర్తుల్ని తలుచుకొంటూ ఎన్నిసార్లు బాత్రూంలో కెళ్ళి కళ్ళుతుడుచుకొన్నానో… కొట్టిన తర్వాత ఒక్కసారి… కేవలం ఒక్కసారి… ఆ పాలబుగ్గల మీద అలా రాసి ఒ చిన్న ముద్దు ఇచ్చేసొస్తే ఆ ఎనిమిది గంటల శిక్షా ఉండేది కాదు. ఆఫీసుకొచ్చాక ఎంత సేపు ఏడ్చాడో?
మధ్యాహ్నం అన్నం తిన్నాడో లేదో? బాగా ఏడ్చి విసిగిస్తున్నాడని అవ్వ మరింత విసుక్కొందేమో? తనూవిసుగేసి రెండు కొట్టిందేమో? ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోతే నిద్రపోయాడేమో?
పీడ విరగడయిందని తనూ నిద్రపోయిందేమో? ఎప్పటికో తెప్పరిల్లుకొని “దాహం” అనడిగితే ఆ నిద్రలోనే వాడిని కసిరిందేమో?
బాబొక్కడే నిద్రలేచి “అమ్మా మంచి నీళ్ళమ్మా” అని ఇల్లంతా తిరిగాడేమో?
ఒక్కో ప్రశ్నా ఒక్కో ప్రశ్నా వేసుకొంటున్న కొద్దీ గుండెలోని బరువంతా కాళ్లలోకి వచ్చేసినట్టు అడుగులు మరింత తడబడుతున్నాయి.
పొద్దున్న కోపంతో అన్నం తినకుండా బయల్దేరిపోయాను. మధ్యాహ్నం లంచవర్లో తినబుద్ధి గాక మానేశాను. ఆ బరువుని మొయ్యలేనంటున్నాయి నీరసంగా ఉన్న కాళ్ళు అసలెందుకంత కోపం వచ్చింది నాకు?
అది కోపం కాదు నిస్సహాయత… నిస్సహాయతా కాదు… ఉక్రోషం… ఉక్రోషమూ కాదు దు:ఖం…
పొద్దున్నే పక్కింటి అబ్బాయి ఓ కాడ్బరీస్ చాక్లెట్ తెచ్చుకొని బాబెదురుగా నిల్చొని తింటుంటే ఆశగా చూశాడు బాబు.
“అమ్మా నాకూ అటువంటి కాడ్బరీ చాక్లెట్ కావాలి” అని పేచీ పెట్టాడు.
పర్సులో ఉన్న ఆఖరి పది రూపాయల నోటు కూడా నిన్నటితో ఖర్చయిపోయింది. పర్సులో బస్సులో వెళ్ళడానికి సరిపడా చిల్లర డబ్బులున్నాయంతే!
“ఇవాళ జీతాలొస్తాయిగా! బోల్డుడబ్బులొస్తాయి. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఒకటి కాదు రెండు కొనితెస్తాను. ఏం?” అన్నాను.
ఊహూ వినడే!
బాబెదురుగానే ఆ అబ్బాయి అలా లొట్టలేసుకొని తింటుంటే బాబు నోట్లోంచి ఊరుతున్న లాలాజలాన్నీ… కళ్ళలోంచి ఉబుకుతున్న ఆశను చూస్తుంటే కన్నీళ్ళు దాచుకోవడం ఎంత కష్టమయిందో!
ఎంత చెప్పినా వినకుండా ఏడుపు లంకించుకొన్నాడు…కాళ్లు తపతపా కొట్టుకొన్నాడు… అన్నప్పళ్ళాన్ని దూరంగా తోసేశాడు… స్నానానికి రానని మొండి కేశాడు…
ఉక్రోషం, నిస్సహాయత, దు:ఖం కలగలసిన భావం మనసుని ఉక్కిరిబిక్కిరి చేయగా నా బతుకుమీద నాకే అసహ్యం పుట్టగా ఎవరిమీదో కసితీర్చుకొంటున్నట్టు బాబు చెంపమీద చెళ్ళుమని కొట్టి బాబు ఏడుస్తున్న ఏడుపుని కూడా పట్టించుకోకుండా వచ్చేశాను.
ఫలితం ఎనిమిది గంటల నరకయాతన….. కానీ.. అనుకొన్నట్టు జీతాలొచ్చేసుంటే బాబుకి ఓ రెండు కాడ్బరీలు కొని తీసికెళ్ళుంటే ఈ చిత్ర హింస కొద్దిగానైనా తగ్గేదేమో!
కానీ మామూలే! ఈ రోజూ జీతాల్లేవు. రేపు తప్పకుండా ఇస్తారట. అప్పుకొసం చెయ్యి చాచక తప్పలేదు.
ఈ రోజు తప్పక జీతాలిస్తారని పర్సులోని ఆఖరినోటుని కూడా ఖర్చు పెట్టేసుకొని వచ్చిన నాలాంటి వారే అందరూనూ!
అందరివీ చాలీచాలని బతుకులే!
ఎలాగోలా అయిదు రూపాయలు దొరికాయి. ఆ అయిదు రూపాయిల్లోనూ బస్సుకి రూపాయి పోనూ మిగిలినవి నాలుగు! వేస్తున్న అడుగులు ఆగిపోయాయి…
ఎదురుగా ద్వారకా ఎంపోరియం అని మెరుస్తున్న అక్షరాలతో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరు… ముందున్న కౌంటరు మీద పెట్టిన సీసాల్లో రకరకాల చాక్లెట్లూ, బిస్కెట్లూ!
ఆ పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరుకి పక్కనే ఓ చిన్న జంగిడీ… ఆ జంగిడీ నిండా పెసరపణుకులు… ఆ పుణుకుల మీద ముసురుతున్న ఈగల్ని చేతిలోని మురికి గుడ్డతో తోలుతూ ఓ ముసలమ్మ…
ముసలమ్మనీ. ఆ జంగిడీనీ, దానిముందు నిల్చొని అవ్వ ఆకుల్లో పెట్టి ఇచ్చిన పుణుకుల్ని ఆబగా తింటున్న మనుషుల్నీ రోజూ చూస్తూనే ఉంటాను…
ఆ జంగిడీని దాటుకొని ద్వారకా ఎంపోరియం ఉన్న వైపు నుండి రెండు కళ్ళు దీనంగా ఆ జంగిడీలోని పుణుకుల వైపు చూస్తున్నాయి… ఆ కళ్ళల్లో అదే ఆశ… ఆ చూపుల్లో అదే దీనత్వం… ఆ నోట్లో అదే లాలాజలం…
పొద్దున్న పక్కింటి అబ్బాయి కాడ్బరీ చాక్లెట్ తింటున్నప్పుడు బాబు చూపులకి ప్రతి బింబం లాగున్నాయి ఆ చూపులు!
రెండడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగి చూశాను.
పుణుకుల మీంచి చూపు తిప్పి ఒంగొని నేలమీద ఏదో వెతుకుతోంది ఆ పాప. చిరిగి వెలసిపోయి ఒదులొదులుగా వేలాడుతున్న గౌను… చింపిరి తల… మట్టిపట్టిన ఒళ్ళు… పుల్లల్లాంటి చేతులూ కాళ్ళూ… లోతుకుపోయిన బుగ్గలూ…

కిందకొంగి ఏదో వెతుకుతున్న ఆపిల్లవైపే అలా చూస్తుండిపోయాను కాస్సేపు. నిండా పదేళ్ళు కూడా ఉన్నట్టు లేవు. మరి ముందుకడుగెయ్య బుద్ధిపుట్టలేదు. వెనక్కు తిరిగి ఆ పిల్ల దగ్గరకు నడిచి అడిగాను.
“ఏయ్ పిల్లా ఏంటి వెతుకుతున్నావ్?”
“రూపాయి… రూపాయి బిళ్ళ ఈడ ఏడనో పడిపోనాదండీ…” చాలా సేపట్నుంచి వెతుకుతున్నట్లుంది, ఆ గొంతులో చెప్పలేనంత నీరసం…
నా మనస్సు కలుక్కుమంది.
“పుణుకులు కొనుక్కోడానికి వచ్చావా?” అడిగాను.
అవునన్నట్టు తల ఊపింది.
“రూపాయి పోయింది కదా… పోనీ ఇంటి కెళ్ళి అమ్మనడిగి ఇంకో రూపాయి తెచ్చుకోకూడదూ?”
జాలిగా చూసిందాపిల్ల. “అమ్మ సిన్నపుడే సచ్చిపోనాదండీ. అయ్యనడిగితే ఇత్తాడుగానీ పిన్ని కొట్టుద్దండీ” గౌనుని ఒక చేత్తో మెలిపెడుతూ ఆగిఆగి చెప్పింది.
“మరి ఈ రూపాయి నీకెవరిచ్చారూ?” అనుమానంగా అడిగాను.
“పొద్దుటేల బస్టాండుకాడ ఎవరివో సామాను కూసింత దూరం మోసుకెళ్తే రూపాయి ఇచ్చారండీ. సాయంత్రం పుణుకులు కొనుక్కోచ్చు కదా అని గౌనుకి కట్టుకుని దాచుకొన్నానండి. ఇక్కడికి వచ్చేదాకా ఉందండీ. పుణుకులు కొనుక్కొందామని చూసేసరికి కనపళ్ళేదండీ. ఇక్కడే ఎక్కడో పడిపోయినట్టుందండి.” గబగబా చెప్పేసి మళ్ళా ఒంగొని వెతకసాగింది.
“ఎంతసేపట్నుంచి వెతుకుతున్నావ్?” అడిగాను.
“మద్దేనం కూసింత ఎండవుండగానే వచ్చానండి” అంది.
అంటే రెండు మూడు గంటల్నుంచి అక్కడే అలాగే కింద పడిపోయిన ఆ రూపాయి బిళ్ళ గురించి వెతుకుతోందా? ఉండలా గొంతుకడ్డుపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాధ మరింత ఎక్కువయింది…
ఒక్కరూపాయి… కేవలం ఒక్కరూపాయి… నా దగ్గరున్ననాలుగురూపాయల్లోంచి ఒక్క రూపాయి తీసి ఇచ్చేస్తే?
అమ్మో! మిగిలిన మూడు రూపాయల్లో బాబుకి కాడ్బరీ కొనేస్తేబస్సుక్కూడా డబ్బులు మిగలవ్.
నెమ్మదిగా వెనక్కు తిరిగాను. ఈ సారి అడుగులు మరింత బరువయ్యాయి అయినా నేనింత బాధపడిపోవడమెందుకు? ఆ పిల్ల డబ్బులు పోయాయని అబద్ధం చెబుతూందేమో? మూటలు మోశానని అబద్ధం చెబుతూందేమో? రెండడుగులు ముందుకు వేశాను…
ఊహూ! ఆ మాటల్లో అబద్ధం ఉందేమో గాని ఆ మొహంలోని ఆకలి అబద్ధంకాదు… ఆ చూపుల్లోని నిరాశ అబద్ధం కాదు… నోటి లోంచి ఊరుతున్న తడి అబద్ధం కాదు…
మరో రెండడుగులు వేశాను. అయినా నేను మాత్రం ఏం చేయగలను?
ఆచిన్న కాడ్బరీ చాక్లేట్ని బాబు చేతిలో పెట్టి ఆ చిన్న బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తే గాని గుండెలో మంటలు చల్లారవు.
మరో రెండడుగులు వేశాను. బాబు ఏడిస్తే ఎప్పటికైనా సరే కన్నీళ్ళు తుడిచి బుగ్గమీద ఓ ముద్దియ్యడానికి ఓ అమ్ముంది. ఇవాళ కాకపోయినా రేపైనా తను ఆశపడిన వస్తువు తినడానికి అవకాశముంది. కాని ఆ పాపకి..? ఓ నాలుగు పెసర పుణుకులు తినాలంటే నాలుగు కిలోల బరువు మోయాలి… కళ్ళంట నీళ్ళెట్టుకుంటే తుడిచే చెయ్యిలేదు. చెంప ఛెళ్ళుమనిపించే చెయ్యే ఉంది.
మరో రెండడుగులు వేశాను. బాబుకి మూడు రూపాయల ఆ ఖరీదైన చాక్లేటే కొనక్కర్లేదు. ఓ రూపాయి పెట్టి చిన్నది కొని మరిపింతలు పెట్టోచ్చు.
కానీ ఆ పాపకి అలా ఎవరు మరిపింతలు పెడతారు?
ఏ అర్ధరాత్రి దాకానో ఎక్కడో పడిపోయిన ఆ రూపాయి బిళ్ళ గురించి వెతికి వెతికి ఆపుకొంటున్న వెక్కిళ్ళతో ఇంటి దారి పడుతుందేమో?
అడుగులు మరి ముందుకు పడలేదు. గిరుక్కున వెనక్కు తిరిగాను. తిన్నగా ఆ పాపదగ్గరికి నడిచి చేతిలోని పర్సు తెరిచి అందులోని నాలుగు రూపాయి నోట్లలోంచి ఓ నోటు తీసి గబగబా ఆ పాప చేతిలో పెట్టేశాను ఆలస్యమయితే మనస్సు ఎక్కడ మారిపోతుందోనన్న ఆత్రంతో.
మరో మూడు నిమిషాలకల్లా పావ చేతిలో ఆకులో కట్టిన నాలుగు పెసరపుణుకులున్నాయి… వాటిని చూడగానే ఆ పాప కళ్ళు తళుక్కున మెరిశాయి… నేను చూస్తుండగానే పెదవులు తడయ్యాయి… ఎంతో అపురూపంగా పొట్లాన్ని పట్టుకొని ముందుకు నడిచిందా పాప.
“అదేంటి పుణుకులు తినవూ?” ఆత్రంగా అడిగాను.
ఒక్కసారి నా మోహం వైపు ఆ తరువాత చేతిలోని పొట్లాం వైపు ప్రేమగా చూసిందాపిల్ల.. ఆ తర్వాత నెమ్మదిగా అంది…
“ఇయ్యి … ఇయ్యి.. నా గురించి కాదండీ… ఇంట్లో మా తమ్ముడున్నాడు… సిన్నోడు… ఆడికిట్టాంటివి నేను కొనియ్యక పోతే ఎవరిస్తారు?” అలా అంటూనే ఆ పొట్లాన్ని భద్రంగా గౌన్లో చుట్టేసి ముందుకు నడిచిపోయింది. నిశ్చేష్టురాలినై చూస్తుండిపోయాను.
గొంతులో ఉండలా అడ్డుపడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బాధ కరిగిపోయి కళ్ళలోంచి బయటకుబికింది. ఇంట్లోని నా బాబు రూపం వెళ్ళిపోతున్న ఆ పాప రూపంలో కరిగిపోయి కలిసిపోయినట్టనిపించిందో క్షణం. కన్నీళ్ళ తడిలో మసకబారిన కళ్లకి ఆ పాప వేస్తున్న ఒక్కో అడుగూ “నీలాలుగారితే నే చూడలేనూ… పాలైనా కారవే బంగారు కళ్ళూ.” అన్న పాటలోని ఒక్కో చరణంలా వినిపించింది.
చాలీచాలని చిరుగుల దుప్పటికో చిన్న మాసికలా!

 

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *