Addamu Pratibimbamu

Share Button

 

ఆంధ్ర ప్రభ 27.05.1970

మార్చి నెల ! వేడి గాడ్పులు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతున్నాయి…
మధ్యాహ్నం మూడు గంటలయి ఉంటుంది. పర్మిషన్ తీసుకొని ఆఫీసులోంచి బయటపడ్డాను….
కోటీలో సామానులు కొనుక్కొని పధ్నాలుగో నంబరు బస్సు స్టాపుకు వచ్చాను… అంతా నిశ్శబ్దంగా ఉంది… బహుశా అప్పడే బస్సు వెళ్లిపోయి ఉంటుంది…
ఉస్సురని నిట్టూరుస్తూ వెళ్లి నీడలో నిలుచున్నాను మొహానికి పట్టిన చెమట రుమాలుతో తుడుచుకొంటూ…
ఉమెన్స్ కాలేజీలో చెట్టుమీద కాకులు కావుకావుమని అరుస్తున్నాయి…. వాటి అరుపుల్లో కూడా ఒక లయ ఉంది… మల్లెపూల వాసన గాలిలో తేలి వచ్చింది…
పక్కకి చూశాను…. ఒక తల్లీ, కొడుకూ కాబోలు నిలుచుని ఉన్నారు…. ఆవిడికి ఇరవై అయిదేళ్ళుంటాయి…. అందంగా ముడిచుట్టుకొని ఒకపక్క మల్లెపూలు తురుముకొంది…. ఆ అబ్బాయికి మూడు నాలుగేళ్లుండవచ్చు…. ముద్దుగా, ఆరోగ్యంగా ఉన్నాడు….
కాకుల అరుపూ, అప్పుడప్పుడు ఆ కుర్రాడు ముద్దుముద్దుగా తల్లినడిగే ప్రశ్నలూ తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది….
మల్లెపూల సౌరభం… మామిడి పూత వాసన అన్నీ కలిపి ఓ వింత అనుభూతిని కలగజేస్తున్నాయి….
చిన్నతనపు తీయటి జ్ఞాపకాలు మనస్సులో మొదలసాగాయి…
నదిలో ఈతలు… తోటల్లో దొంగతనంగా కాయలు కోసుకుతినడం… తోటమాలి కొట్టడానికి వస్తే చిలిపిగా ఏడిపించి పారిపోడం…
పోటీలుపడి గాలిపటాలు ఎగరేసుకోడం… కుస్తీలు పట్టడం… మళ్ళా కలిసిపోయి ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని బడికి పోవడం…అన్ని జ్ఞాపకం వచ్చాయి… అప్రయత్నంగా ఓ నిటూర్పు విడిచాను.
భౌంయిమంటూ ఒకటో నంబరు ట్రైలరు బస్సు దూసుకుపోవడంతో కల కరిగిపోయింది.
కళ్లకి చెయ్యి అడ్డం పెట్టుకొని బస్సుకోసం చూశాను. నాకు కావలసిన బస్సు తప్ప అన్ని బస్సులూ వెళ్లిపోతున్నాయి.
ఇంతలో నలుగురైదుగురు కాలేజీ అమ్మాయిలు వచ్చారు. వాళ్ల నవ్వులూ కేరింతలతో నిశ్శబ్దమంతా ఎగిరిపోయింది. అప్పడే యౌవ్వనంలోకి అడుగు పెట్టిన వాళ్ల కళ్లల్లోని రంగుల కల లింకా చెరిగిపోలేదు….
నేనూ ఒకప్పుడలాగే బరువులూ, బాధ్యతలూ లేకుండా తిరిగినవాణ్ణే… అందమైన కలలు కన్న వాణ్ణే… ఆ కలలు రంగు రంగుల మబ్బుల్లాంటివి… వాటిని చూస్తూ ఉంటేనే ఆనందం. పట్టుకొందామంటే చేతిలోకి ఏమీ రాదు.
క్రమక్రమంగా మనుష్యులు రాసాగారు. బురఖాలు ధరించిన ముస్లిమ్ స్త్రీ లిద్దరూ, స్కూలు పిల్లలు ముగ్గురూ, మరో పది పదిహేను మంది వచ్చారు.
“రెండు రోజుల నించి తిండి లేదు. ఒక్క పైసా ధర్మంచెయ్, దొరా ! నీ కాల్మొక్త.”
తల తిప్పి చూశాను. నాకు పరిచయమైన ముసలవ్వ ఎదురుగా నిలిచి ఉంది. అప్పడప్పుడు తానక్కడికి రావడం, నేను తనకి ఒకటో రెండో పైసలు వెయ్యడం జరుగుతూనే ఉంటుంది.
తనని చూసినప్పడల్లా నాకు పండి రాలిపోబోయే ఆకు గుర్తుకు వస్తుంది. జీవితంలో ఆమె గడించిన అనుభవాల్లా ఉన్నాయి ఆమె ముఖం మీది ముడతలు…
ప్రపంచంలోని దరిద్రాన్నంతా మోస్తున్నట్టు వంగిపోయి ఉంది ఆమె నడుం. దీనాతిదీనంగా చూస్తున్న ఆమె కళ్లలోకి చూశాను. ఇంత ముసలితనంలోనూ అంత నికృష్టంగా ఎలా బతకగలుగుతూందో!
నేను పర్సు తీయబోయి హిప్ పాకెట్లో చెయ్యి పెట్టేసరికి నోట్ల పాకెట్టు తగిలింది. దాన్ని తిరిగి హిప్ పాకెట్లోనే పెట్టేసి, షర్ట్ జేబులోనించి పర్సు తీశాను. కొన్ని రూపాయి నోట్లూ ఒక అర్థ రూపాయిూ, కొన్ని పదిపైసల బిళ్లలూ ఉన్నాయి.
చిన్న పైసల కోసం వెతుకుతున్నాను. ముసలమ్మవైపు చూశాను. కళ్లలో దైన్యాన్ని నింపి ఆశగా నావైపు చూస్తూంది.
“నీ కాల్మొక్త బాన్చన్” అంది.
“బాన్చన్” అంటే నీ బానిసను అని… వీళ్లకి దాని అర్థం తెలుసా?
“చిల్లర లేదవ్వా” అనబోయి తన మొహం చూసి పర్సులోంచి పది పైసలు తీసి తన బొచ్చెలో వేశాను.
“వెయ్యేళ్లు చల్లగుండాల తండ్రీ” అంది చెయ్యెత్తి దండం పెడుతూ…
“పోనీలే… మసిలిలమ్మ నా పేరు చెప్పుకుని ఇవాళింత తింటుంది” అనుకొన్నాను.
“అన్నట్టు ఈ అవ్వతో ఓ కుర్రా డుండేవాడు కదూ! ఏమయ్యాడు చెప్మా!” అనుకొన్నాను.
“అవ్వా నీతో ఓ పిల్లా డుండేవాడు కదూ? ఏడీ వాడు? నీ కొడుకా?” అని అడిగాను.
“కాద్దొరా!నా మన్మడు. కూతురు సచ్చిపోయింది”.
“అలాగా! ఇవాళ నీతో రాలేదెందుకు?”
ఈ అవ్వ సరిగ్గా నడవలేదు. ఇంతకు మునుపు ఆ కుర్రాడు అవ్వని చెయ్యి పట్టుకొని నడిపించడం, రోడ్డు దాటించడం చేసేవాడు.
“ఆ పోరడు పారిపోయిండు దొరా”.
“పాపం నీ కిప్పుడెలాగ?”
మసలమ్మ ఏమీ జవాబు చెప్పలేదు. ఏదో గొణుక్కుంటూ పక్కవాళ్లని బిచ్చం అడగటానికి వెళ్లిపోయింది.
నేను ఈ ముసలవ్వకి పది పైసలు వెయ్యడం చూస్తే రాజారావు ఏమనేవాడో?
ఒక రోజు నేనిలాగే ఎవరికో పదిపైసలు వేస్తే మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.
“ఒరేయ్, నువ్వు తనకి దానం చెయ్యడం జాలివల్ల కాదురా? నువ్వు జాలిపడ్డావని తను అనుకోవాలని… అలాగని నీ మనస్సుని కూడా నమ్మించడానికి ప్రయత్నిస్తావు” అన్నాడు రాజారావు
“వెధవ పది నయా పైసలకోసం కక్ముర్తి పడతామా? అలాంటివి రోజుకు ఎన్నిఖర్చుచేస్తున్నామో!”
“అదుగో, అందుకే నేనంటాను నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావని! నీ మనసు మీద నువ్వు కప్పుకున్న ముసుగు తీసి చూడు, నీకే తెలుస్తుంది. నిజానికి నువ్వెంతో ధర్మ ప్రభువువని తన మనస్సులో ఏర్పడిన భావం చెరిపెయ్యటం నీ కిష్టం లేదు. ఇష్టం లేదనేకంటే ధైర్యంలేదనడం బాగుంటుంది”.
“ప్రతిదానికీ ఇలాంటి అర్ధాలు తీస్తే ఇంక బాగుపడ్డట్టే ! ఏదో తనని చూసి జాలి పడీ…”
“ఛస్! జాలి అన్నమాట నా దగ్గర వాడకు. నిన్ను నువ్వు తృప్తి పరచుకోడానికి వాడుతున్న అందమైన మాట అది. అయినా వీళ్లకి ధర్మం చేస్తే వీళ్లు నీకు కృతజ్ఞత చూపిస్తారనుకోవడమేమిటి? నువ్వు వాళ్లపట్ల జాలిపడ్డట్టు ఎలా నటిస్తున్నావో వాళ్ళూ నీ పట్ల కృతజ్ఞత చూపిస్తున్నట్టు అలాగే నటిస్తారు. అంతా నటనే. అలా అని ఇద్దరికీ తెలుసు కాని ఎవరికి వారే తాము నటించడం లేదనీ తృప్తి పడతారు”.
“నీకు మనస్సనేది లేదురా! కళ్లులేని వాళ్లనీ, కాళ్లు లేని వాళ్లనీ చూస్తే నీకు జాలెయ్యదూ? నీలాగ ఆలోచిస్తే అందరూ మోసగాళ్లుగానే కనపడతారు. అయినా మనుషుల్లో ఉన్న మంచితనాన్నే చూడాలి కాని వాళ్లలో ఉన్న స్వార్ణాన్నీ కుళ్ళునీ చూస్తే ఎలా?”
“అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఒక దొంగ ఉన్నాడనుకో. వాడు దొంగతనం చెయ్యడం చూస్తూ కూడా, పాపం, వీడు దొంగతనం చేసినా మంచివాడు. వీణ్ణి దొంగగా చూస్తే మనమూ చెడ్డవాళ్ల మయిపోతామని చేతులు కట్టుకు కూర్చోవాలా?” వెటకారంగా అన్నాడు.
“అలా అని నేనన్నానా? వాడు చేసే పని చెడ్డదే కాని వాడి మనసు చెడ్డదో కాదో చూడాలి. ప్రతి మనిషికీ ఉన్న మనసే వాడికీ ఉంటుంది. అందులో మంచీ ఉంటుంది. చెడూ ఉంటుంది. అయితే అవి ఓ పాలు ఎక్కువ తక్కువలు కావచ్చు. వాటిలోఉన్న మంచినే ఎందుకు చూడకూడదు? వీలైతే చెడును కూడా ఎందుకు మంచిగా మార్చకూడదు?”
“భేష్ లెక్చర్ బావుంది”.
“నీ కన్నీ పరిహాసంగానే కనిపిస్తాయి. మన మనస్సొక అద్దం లాంటిది. అది వంకరటింకరగా ఉంటే అందులో పడ్డ ప్రతిబింబాలు కూడా వంకర టింకరగానే ఉంటాయి”.
“ఉపమానం బాగుంది. ఏ పత్రికలో చదివావు?” అన్నాడు సిగరెట్ నుసిరాలుస్తూ నిర్లక్ష్యంగా…
“నీకు చెప్పి లాభం లేదు.” అన్నాను విసుగ్గా…
“అది కాదయ్యా మనస్సు అద్దం లాటిదని ఒప్పుకొన్నాను… అది వంకర టింకరగా ఉంటే బాగుచెయ్యగలం కాని అందులో పడ్డ నీడల్ని సరిచెయ్యలేం కదా! ఎటొచ్చీ అందులో పడ్డ నీడలన్నీ అందంగా ఉన్నాయనుకోడమే మనల్ని మనం మోసం చేసుకోవడం”.
అక్కడికి ఆ సంభాషణ ఆగిపోయింది.
“ఆ ఫూల్ ఇప్పుడిక్కడ లేకపోవడమే మంచి దయింది” అనుకొన్నాను.
ఆ ముసలమ్మ ఇంకా అడుగుతూనే ఉంది. నాలాంటి వాళ్లు కొందరు డబ్బు వేస్తున్నారు. లేనివాళ్లు తనవైపు చూడటానికి ధైర్యంలేక ఎటో చూస్తున్నారు. ఇంతలో బస్సు వచ్చింది. అంతవరకు క్యూలో నిలుచున్న వాళ్లందరు ఒకరి నొకరు తోసుకొంటూ, దిగేవాళ్లని దిగనియ్యకుండా బస్సెక్కడానికి ప్రయత్నించసాగారు.
నిజానికి అక్కడున్న మనుషులందరూ బస్సులో ఎక్కినా కొన్ని సీట్లు మిగులుతాయి. అయినా ఎవరికి వారు ముందెక్కాలని తొందర!
ఆ తొందరలో బస్సెక్కడంలో ఆ నలుగురు కాలేజీ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని నేను తోసేశాను.
“సారీ” అన్నాను. నా వైపు కోపంగా చూస్తూ బస్సెక్కింది. మా ఇద్దర్లో తప్పెవరిదో నాకర్ధమవలేదు.
బస్సు కదిలింది. నా పక్కనో ముసలతను కూర్చొన్నాడు.
“సరోజినీ దవాఖానాకు పోద్దా?”
“పోతుంది“
“నువ్వేడకి పోతున్నవ్?”
“మెహిదీ పట్నానికి తాతా”
“రెండు రోజుల బట్టి కంటెంబడి ఒకటే నీల్కార్తన్నయి.”
“ఉహూ!”
“మా బిడ్డ సెప్పిండు, సరోజిని దవాఖానాకు పో అయ్యా ఆడ కన్నునయం చేత్తరని”.
“ఊc.”
“కంట్ల ఇంజచ్చ నిత్తరంట కదా?”
“ఏమో తెలీదు” అన్నాను విసుగు సాధ్యమైనంతవరకు కప్పిపుచ్చుకొంటూ…
చుట్టూ చూశాను ఎవరైనా మా వైపు చూస్తున్నారేమోనని…
అందరి కళ్ళూ పరిహాసంగా మావై పే చూస్తున్నట్లనిపించింది.
“ఇతనెక్కడ దాపురించాడురా, బాబూ’ అనుకొన్నాను.
మళ్లా రాజారావుతో అన్న అద్దం ప్రతిబింబం మాటలు గుర్తు వచ్చి సిగ్గుపడ్డాను.
రాజారావంటాడు.. “ఒరేయ్, అందర్నీ సంతోషపెట్టాలనీ, అందరి దృష్టిలో మంచివాళ్లమై పోవాలనీ మన వ్యక్తిత్వాన్ని చంపుకోవడం మనని మనం బానిసలుగా చేసుకోవడమేరా! మనం మంచి అనుకొన్నది చేయడానికి కొందరి దృష్టిలో చెడ్డవాళ్లమై పోయినా ఫర్వాలేదు.”
“ఇంకొకరికోసం స్వార్గాన్ని త్యాగం చెయ్యడంలో ఉన్న ఆనందం నీకు తెలీదురా.”
“నువ్వు స్వార్గాన్ని త్యాగం చెయ్యడం వల్ల ఆనందం కలుగుతూందా? స్వార్గాన్ని త్యాగం చేస్తున్నావని ఇతరులు గుర్తించడం వల్ల కలుగుతూందా? ఏది నిజమో నీ మనస్సుకే తెలుసు. ఇంకో సంగతి. స్వార్థ త్యాగం, వ్యక్తిత్వాన్ని చంపుకోడం ఈ రెండిటి మధ్యా చాలా బేధం ఉంది. నువ్వు రెండోది చేస్తున్నావు కాని దానివల్ల మొదటిదాన్ని సాధించలేక పోతున్నావు.”
నాంపల్లి బస్టాప్ వచ్చింది. అక్కడ కొందరు దిగిపోయారు. చాలా మంది ఎక్కారు…
నా సీటు పట్టుకొని ఒక పదహారు పదిహేడేళ్ల అబ్బాయి నిల్చొన్నాడు…
వీడినెక్కడో చూసినట్టుంది. ఆC అవును. వీడే ఆ ముసలమ్మ మనవడు…
ఒత్తు కనుబొమ్మలూ, దుబ్బు జుత్తు, లావు పెదవులూ.. ఈ వెధవే ఆ ముసలమ్మని వదిలేసి పోయాడు…
ఇలాంటి వాళ్లకి జాలి, దయ అనేవి ఉండవు కాబోలు! దరిద్రం తాండవించే చోట ప్రేమాభిమానాలు కరువవుతాయేమో !
“ఏమోయ్’ పిలిచాను.
తిరిగి చూశాడు. తరవాత గుర్తుపట్టి నెమ్మదిగా సలాం చేశాడు.
“ఏమయ్యా మీ అవ్వని వదిలి పారిపోయేవటగా?”
“అవున్దొరా.”
“పాపం, మసిలిది ఒక్కర్తీ ఎలా ఉంటుందనుకున్నావోయ్? కళ్ళుకూడా సరిగ్గా కనిపించవు కదా.”
తల వంచుకొన్నాడు.
“ఏం, జవాబు చెప్పవ్? ఇప్పడేం చేస్తున్నావ్?”
“కూలిపన్దొరా”…
“హాయిగా ఇక్కడ నీ మానాన నువ్వు తిరుగుతూంటే ఆ ముసలవ్వని చూసేదెవరు? నీకు బాధగా లేదురా అలా తనని వదిలి వచ్చేయడానికి?”
వాడు తల మరింత కిందికి దించుకొన్నాడు. నా కాళ్లమీద టప్ టప్మని నీళ్లు పడ్డాయి. గతుక్కుమన్నాను. వీడేడుస్తున్నాడా? వీళ్లకి కూడా ఏడుపు వస్తుందా?
తరవాత వాడు మెల్లిగా కళ్లు పైకెత్తాడు.
“నాకు బిచ్చమెత్తి బతకటం ఇట్టం లేద్దొరా, నౌకరీ చూసుకొంటనంటే మాయవ్వ వద్దు పొమ్మంటది… ఎప్పడు దానెంబడె ఉండమంటది… ఇట్ట నాబంలేదని పారిపోయిన. మొన్న దానికాడికి బోయిన. ఒక రూపాయియ్యబోతే తీస్మోలే. ఇసిరి కొట్టింది”.
నేనాలోచిస్తున్నాను. ఇంకొకరిదగ్గిర బిచ్చమెత్తి డబ్బులు సంపాదించడంలో ఆమెకి అభిమానం లేదుకాని, కష్టపడి వీడు సంపాదించి తెచ్చిన డబ్బు పుచ్చుకోడానికి అభిమానం అడ్డువచ్చింది. వీడు తన స్వార్థం తాను చూసుకొన్నాడను కొన్నాను. మరి వీళ్ళిద్దర్లో స్వార్ధ పరులెవరు?
“ఈడ ద్వారకొటల్లో సర్వరు పని కాళిగుందట, చూద్దామని పోతాన్న”
వాడి స్థాపు వచ్చింది. దిగబోయాడు. నా పర్సులోంచి పది పైసలు తీసి వాడి చేతిలో పెట్టాను.
“వద్దు దొరా! నే నిప్పుడు అడుక్కొనేటోడ్ని కాదు” అని డబ్బులు తిరిగి నా చేతిలోపెట్టేశాడు. రాజారావు పక్కన లేకపోవడం మంచిదయింది…
ఉంటే ..”నీ మంచితనం వీడిదగ్గర చాటుకొందామనుకొన్నావు! పాపం, వాడు దానికి అవకాశం కలిగించలేదు!” అని ఉంటాడు.
మెహిదీపట్నంలో బస్సు దిగాను. ఈ రోజు మనస్సంతా ఎందుకో చిరాగ్గా ఉంది. ఈ వేళ జీతాలందిన రోజు! ఎంతో సంతోషంగా ఉండవలసిన రోజు!
శాంత గుమ్మంలోనే నిల్చొని ఉంది.
“అమ్మయ్య వచ్చారా! తొందరగా వస్తానని ఇంకా ఎందుకు రాలేదా అని బెంగపడి చస్తున్నాను.”
“అబ్బో ఎంత ప్రేమ నేనంటే ఫస్టు తారీఖు కదూ!”
“బావుంది” అంటూ మూతి తిప్పతూ లోపలికి వెళ్లింది.
“ఇవేళ నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం”
“పువ్వులూ, స్వీట్లూ, ఇంకా అదిగో సంచిలో కనపడుతున్నాయిగా కూరలు. ఇవేగా ఎప్పడూ ఫస్టు తారీఖున తెచ్చేవి”
“ఊహూC.! ఇంకోటి తెచ్చాను.”
“మీరే చెప్పండి, బాబూ, నాకిప్పుడు ఓపిక లేదు.”
సంచీలోంచి చీర తీసి ఇచ్చాను…
“అబ్బో ఎప్పడూ లేంది ఏమిటి ఈ వేళ నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది” అంది మురిపెంగా చీర చూసుకొంటూ,
“అది సరేకాని అసలయింది తియ్యండి. జీతం డబ్బు లెక్కడ పెట్టారు?”
“ఇదిగో , అదీ తీస్తాం. నేనేం దద్దమ్మని అనుకొన్నావా? పర్సులో కొంత డబ్బుంచి మిగతాదంతా వెనక జేబులో పెట్టాను.”
వెనక జేబులో చెయ్యి పెట్టాను. గుండె గుభేలు మంది. అందులో జీతం డబ్బుల్లేవు. నేను గాభరాగా వెతకటం చూసి శాంత మరింత గాభరాగా అడిగింది…
“ఏమండీ, ఏమయింది?”
“ఈ జేబులోనే పెట్టాను శాంతా, బాగా గుర్తు. ఇప్పడు చూస్తే లేవు.”
“సరిగ్గా చూడండి. పర్సులో పెట్టారేమో!”
పర్సులో చూశాను. నాలుగు రూపాయలూ, కొంత చిల్లరా ఉన్నాయి.
“లేదు పర్సులో పెట్టలేదు. వెనక జేబులోనే పెట్టాను. బాగా గుర్తు.”
సంచీలో వెతికాం. కూరగాయలన్నీ తిరగబోసి చూశాం. చీర మడత విప్పి చూశాం. ఉండబట్టలేక ఆఖరికి స్వీట్ పాకెట్ కూడా విప్పి చూశాం.
“మన పిచ్చి కాని వీటన్నిటిలోను ఎంత వెతికినా దొరుకుతాయిటండీ! ఏ వెధవో కొట్టేసి ఉంటాడు. ఎన్నిసార్లో చెప్పాను జాగ్రత్తగా ఉండమని. నా మాటంటే మీ కంత నిర్లక్ష్యం.”
“వెళ్లి పోలీస్ రిపోర్టు ఇచ్చి వస్తాను.”
“వెళ్లండి. అయినా వస్తువు లేవయినా పోతే పోలీస్ రిపోర్టు ఇచ్చినా లాభం. డబ్బులు పోతే మళ్ళా దొరుకుతాయిటండీ!”
“సరే… నే వెళ్ళొస్తా తలుపేసుకో”.
వచ్చినట్టే మళ్ళా బయలుదేరాను.
ఎవరు తీసి ఉంటారు? ఎవరు తియ్యడాని కవకాశముంది? బస్సులో పోయి ఉంటుందా?
నేను బస్సు స్టాపుకి వచ్చిన దగ్గిరనుండి జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకొన్నాను.
మొదట ఓ తల్లీ, కొడుకూ వచ్చారు. వాళ్లు తియ్యడాని కవకాశం లేదు. ఏమో చెప్పలేం! ఈ మధ్య కొందరాడవాళ్లు పిల్లల చేత దొంగతనాలు చేయిస్తున్నారట. చూడ్డానికి గౌరవస్థుల్లాగే ఉన్నారు. అయినా మెరిసేదంతా బంగారం కాదు కదా!
క్యూలో ఆ అమ్మాయి నన్ను తోసేసిందిగా! ఆవిడ గారు కాలేజీలో చదువుతూందో జేబులు కొడుతూందో ఎవరు చూశారు? నలుగురూ కట్టకట్టుకొని ప్లాన్ వేసుకొని వచ్చి ఉంటారు. ఇక పోతే ముసలమ్మ! అవును! ముసలమ్మ నాకు దగ్గరగా వచ్చింది. అప్పడు నేను జేబులోంచి పర్పు తియ్యబోయి, హిప్ పాకెట్లోంచి నోట్ల పాకెట్ తీశాను. అప్పుడామె చూసింది. నేనింకో వైపు చూడ్డంలో మెల్లిగా లాగేయలేదు కదా? మొన్న ఇలాగే ఎవర్తో మసిలిది ఒకడి జేబు కొట్టేస్తూంటే పట్టుకొన్నారట. చెప్పలేం ఎవరెటువంటివారో?
నేను వట్టి వెధవని. పాపం మసిలిది కదా అని ముందూ వెనకా చూడకుండా ధర్మం చేశాను.
బస్సులో ఆ మసిలమ్మ మనవడు నా పక్కనే నిల్చొన్నాడుగా! వాడు చేసినా చెయ్యచ్చు. నా పక్కనే నన్ను తగులుతూ నిల్చొన్నాడు.
వెధవకి అడుక్కోడానికి నామోషీ కాని ఇలాంటి పనులు చెయ్యటానికి తయారు! ఆ బస్సులో ముసలా డొకడు దాపురించేడు. అతన్ని మాత్రం ఎవరు నమ్మమన్నారు? అంతా ఒక్కలాంటివాళ్లే దొంగబుద్దులూ, కుళ్లు మనసులూ….
పోలీస్ రిపోర్టు ఇచ్చి వచ్చాను. నెల్లాళ్లు కష్టపడి సంపాదించిన నాలుగు వందల యాభై రూపాయలూ పోవడానికి నిమిషం పట్టలేదు. అందులో నాలుగాదివారాలూ ఓవర్టైమ్ చేసి సంపాదించిన డబ్బుకూడా ఉంది.
మరునాడు కాళ్ళీడ్చుకుంటూ ఆఫీసుకి వచ్చాను. నేను సీట్లో చతికిలబడ్డ తరవాత రాజారావు నా దగ్గిరికి వచ్చాడు.
“ఏమయ్యా, మహానుభావా, ఏమిటి సంగతి? ఇంట్లో కొంచెం ఎక్కువ తిని వచ్చావేమిటి??
“జీతండబ్బు మొత్తం పోయి నేనేడుస్తుంటే నీ హాస్యాలేంటి మధ్యన?” విసుక్కొన్నాను.
డబ్ము పోయిందన్న మాట వినగానే చూట్టూరా పనిచేసుకుంటున్న మరో నలగురైదుగురు చూట్టూ మూగారు, ఏమయిందేమయిందంటూ…
నిన్న జరిగిన సంగతి అంతా చెప్పాను. అందరూ తలొక సలహా ఇచ్చారు.
“పోలీస్ రిపోర్టిచ్చారా?”
“ఆర్.టి.సి. వాళ్ల దగ్గిరకి వెళ్లి ఆ బస్సులో వెతికించలేకపోయారా?”
“పోన్లెండి, నాలుగురూపాయలై నా వేరుగా ఉంచారు, బొత్తిగా క్షవరమై పోకుండా”
మేనేజర్ రావడంతో అందరూ తమ తమ సలహాలు ఆపేసి ఎవరి సీట్లో వాళ్లు కూర్చొన్నారు.
మధ్యాహ్నం లంచవర్లో రాజారావు నా సీటు దగ్గిరికి వచ్చాడు.
“లేవయ్యా లే… కడుపులో కొంచెం పడితే మనసులో గుబులు కొంత తగ్గుతుంది”.
“ఇప్పడు నేను తిన్నా గొంతు దిగదు”.
“ఎవడ్రా వీడు! ఆఫ్టరాల్ కొంత డబ్బు పోయినందుకే ఇలా ఏడుస్తే ఎలా! రా రా’ అంటూ బలవంతంగా నన్ను కాంటీన్కి లాక్కుపోయాడు.
కాంటీన్ లో ఇడ్లీ తింటూ నేనన్నాను, “ఆ ముసలమ్మో దాని మనవడో తీసి ఉంటారని నాకు గట్టి నమ్మకంరా.”
“ఆ ముసలమ్మ పాపం, మూడు కాళ్లది కదురా! అయినా తనమీద నీకెందు కనుమానం వచ్చింది?” నా కళ్ళ లోకి చూస్తూ అడిగాడు.
“మొదట నేను వీళ్లని అమాయకులనే అనుకొన్నాను. ఇలాంటి వాళ్లందర్నీ అమాయకులనుకోవడం మనదే పొరపాటు.”
“అయితే నా మాట ఒప్పుకొన్నానంటావు?”
నేనేం జవాబు చెప్పలేదు. తరవాత కాఫీ తాగుతూ అన్నాను :
“ఆ గుంట వెధవ మాత్రం తక్కువ తిన్నాడా? వెధవ నా మీద వాలిపోతూ నిల్చొన్నాడు. వాడు దొంగతనం చేస్తాడని ఎవరనుకొంటారు? నేనలా అనుకొనేవాణ్ణి కూడా కాదు. జాలి అనే బలహీనత ఒకటి ఏడ్చింది కదా!”
“నీసంగతి నాకు తెలీదూ?” వెటకారంగా అన్నాడు. నేనతన్ని పట్టించుకోకుండా అన్నాను.
“ఆమెకేమో వాడు తన వెంటే ఉండాలనీ, అడుక్కొని సంపాదించిన డబ్బు తన చేతిలోనే పొయ్యాలనీ దుగ్ద వీడికేమో ఈ మసిలమ్మ పీడ వదిలితే చాలు, విచ్చలవిడిగా తిరగొచ్చని బాధ!”
“ఇద్దరి కిద్దరే నంటావు?”
“వీళ్లిద్దరే నేమిటి? చూస్తే అందరూ అలాగే కనపడుతున్నారు. మొట్టమొదట బస్సుస్టాపుకి ఒకావిడ వచ్చిందిలే. ఆవిడ వెనుక ఓ కుర్రాడు. ఈ మధ్య పెద్దవాళ్లు పిల్లలచేత దొంగతనాలు చేయిస్తున్నారటగా? ఆవిడ ఆ కుర్రాడి చెవిలో మెల్లిగా ఏదో చెప్పింది కూడాను.”
“ఆ కుర్రాడి కెన్నేళ్లుంటాయి?”
“మూడు నాలుగేళ్లుండవచ్చు.”
రాజారావు పకపకా నవ్వాడు.
“నాలుగేళ్ల పిల్లాడు జేబు ఎలా కొట్టేయ గలడనుకొన్నావ్? అసలు వాడికి నీ జేబు అందుతుందా?”
నేను ఉడుక్కొన్నాను.
“పోనీ, వాళ్ల నొదిలేయ్. వాళ్ల తరవాత నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చారు. చూడ్డానికి కాలేజీ సూడెంట్సు లాగే ఉన్నారు. ఒకటే వికవికలూ, పకపకలూ. బస్సెక్కుతున్నప్పడు ఒకమ్మాయి నన్ను గుద్దేసింది. పైగా నేను సారీ చెబితే నావైపు రుసరుస లాడుతూ చూసింది.”
“అయితే ఆ అమ్మాయి తీయడానికవకాశం ఉందంటావు?”
“చెప్పలేం… ఆ బస్సులో నా పక్కన ఓ ముసలాయన దాపురించాడులే!”
“ఇంకేం? వాణ్ణీ నీ లిస్టులో చేర్చేయ్.”
**********************************************************
సాయంత్రం అయిదవుతుండగా ఇద్దరం బయటికి వచ్చాం. నిన్నట్లా ఈ రోజు బస్టాపు నిశ్శబ్దంగా లేదు. స్కూలు పిల్లలతోటీ, ఉద్యోగస్థులతోటీ కిటకిట లాడుతూంది.
ఇద్దరం వెళ్లి క్యూలో నిల్చొన్నాం.
“దొరా!” వెనక్కి తిరిగి చశాను.
ముసిలమ్మ! ఆ మసిలమ్మే నిల్చునుంది.
“ఇట్లరా దొరా!”
అసలామె పిలవకపోయినా నేనే వెళ్లి నాలుగు జాడించేద్దును.
ఆమె కొంగులో దోపుకున్న నోట్ల కట్ట జాగ్రత్తగా నా కందించింది. “ఇది నీదేనా, దొరా?”
ఆత్రంగా తన చేతిలోంచి పాకెట్ లాక్కొన్నాను.
“నీ దగ్గిరికి ఎలా వచ్చిందీ?”
డబ్బు దొరికిన సంతోషంలో కోపం తెచ్చుకోడం కూడా మరిచిపోయాను.
“నిన్న నువ్వు దీన్ని నీ జేబునుంచి తీసినవు కద్దొరా? బస్సెల్లినంక చూసినా, ఈడిది పడున్నది. నీ యవ్వ ఇదాదొర్దే అన్కొన్న. నిన్న నా మన్మడొచ్చిండు. ఇదాదొర్దిదిరా అని చూపిన. ఇప్పడెల్లి ఇచ్చొద్దమన్నడు. నువ్వేడుంటవో తెల్వదు గంద. నువ్వు రోజూ ఈడకే వత్తవు. ఇయ్యచ్చని బద్రంగ దాచిన. డబ్బంతా ఉన్నదా దొరా?”
నేను ఆమె మాటల్ని పూర్తిగా వినలేదు…
నేను వీళ్లని గురించి ఎలా ఆలోచించాను! వీళ్లంతా స్వార్థపరులు… కుళ్ళు మనుషులు… దొంగవెధవలు…
మనస్సు అద్దం లాంటిదని రాజారావుతో అన్నాను….
నా మనస్సెలాంటి అద్దం? వంకరటింకరగా ఉందా? నున్నగా ఉందా?
అందులో పడ్డ ప్రతిబింబాలన్నీ వంకరగా ఉన్నా అందంగా ఉన్నాయని భ్రమపడ్డాను.
ఇంక కళ్లు తెరవాలి. అద్దాన్నే నునుపు చేసుకోవాలి!

Share Button

Paalaina Kaarave Bangaaru Kallu

Share Button

                                             
                       (స్వాతి నవరసముల కథల పోటీలో బహుమతి పొందిన కథ)                                                                      04.09.87 స్వాతి వార పత్రిక
“ఏడవకు ఏడవకు నా చిట్టి పాపా… ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు… నీలాలు గారితే నే చూడలేనూ… పాలైనా గారవే బంగారు కళ్ళూ…”
లోకం మీద ఇంత చీకటిని ఒంపేసి సూరీడు తనేమో హాయిగా ఆకాశం భూమి కలిసే సన్నని గీతకవతల హాయిగా విశ్రాంతి తీసుకొంటున్న వేళ… అసలే బరువుగా అలసటగా పడుతున్న అడుగులు… ఆ ఇంట్లోంచి దూరంగా గాలిలో తేలివస్తున్న ఆ పాట వినగానే మరింత బరువైయ్యాయి…
కాళ్ళలోకి ఎక్కడలేని నిస్సత్తువా వచ్చేసింది. ఒక్కో అడుగూ ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నకొద్దీ ఆ పాట… దానితో బాటు వినిపించే ఉయ్యాలకి కట్టిన మువ్వల చప్పుడూ దూరమవుతున్నాయి.
రోజులాగే అనుకొన్నాను “ఎంత అదృష్టవంతురాలు ఆ పాప!”
అవును మరి… సాయంత్రమయ్యేసరికల్లా అమ్మచేతి గోరుముద్దలు తినేసి… అమ్మ చేత కథలు చెప్పించుకొని… మువ్వలు కట్టిన ఉయ్యాల మంచంలో ఏ కలతలూ ఏ చికాకులు లేకుండా హాయిగా నిద్ర పోతూ…
ఆ తల్లో? ఆమె మాత్రం అదృష్టవంతురాలు కాదూ?
“అమ్మా ఈ రోజునువ్వు ఆఫీసు కెళ్ళద్దమ్మా” అంటూ మోకాళ్ళని చుట్టేసే చిట్టిచిట్టి చేతుల్ని బలవంతంగా విడిపించుకొని వెళ్ళక్కర్లేదు…
ఆఫీసులో క్షణం క్షణం ఆ చిట్టి చిట్టి చేతుల్నీ… ఆ పాల బుగ్గల్నీ తలచుకొంటూ బెంగతో గడపక్కర్లేదు…
ప్చ్! కాళ్ళదాకా కప్పుకుంటే తలకీ, తల దాకా కప్పుకుంటే కాళ్లకీ సరిపోని చిరుగుల దుప్పటి లాంటి జీవితం!
“పాలైన గారవే బంగారు కళ్ళూ.” గుర్తొస్తే చెవుల్లో గింగురుమంటున్న ఆ వాక్యం… మనసులో ఏదో బాధ… ఉండలు తిరిగి గొంతు కడ్డం పడేలా చేస్తోంది.
పొద్దున్న ఆఫీసుకి బయల్దేరి వెళ్ళే ముందు… అసలలా ఎలా చెయ్యగలిగాన్నేను?
విసురుగా తలుపు తీసుకొని వీధిలోకి నడుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి పాలబుగ్గల్ని కన్నీళ్ళతో తడిపేసుకొని కళ్ళింతింత చేసుకొని చూస్తూ కనబడిన బాబు మోహం ఆఫీసులో పనిచేస్తున్న ఎనిమిది గంటల్లోనూ మనసుని నులిమేస్తూనే ఉంది.
ఆ కళ్ళల్లో ఎంత దు:ఖం! దు:ఖం కంటే ఎక్కువగా ఎంత నిస్సహాయం!
అంతకంటే ఎక్కువగా ఎంత ఆశ్చర్యం!
“అమ్మేనా నన్ను కొట్టింది? అమ్మేనా నన్ను కొట్టి ఒక్క చిన్న ముద్దయినా ఇయ్యకుండా వెళ్ళిపోతోంది” – అని.
లేత తమలపాకుల్లాంటి బుగ్గల మీద తట్టతేలిన వేళ్ల గుర్తుల్ని తలుచుకొంటూ ఎన్నిసార్లు బాత్రూంలో కెళ్ళి కళ్ళుతుడుచుకొన్నానో… కొట్టిన తర్వాత ఒక్కసారి… కేవలం ఒక్కసారి… ఆ పాలబుగ్గల మీద అలా రాసి ఒ చిన్న ముద్దు ఇచ్చేసొస్తే ఆ ఎనిమిది గంటల శిక్షా ఉండేది కాదు. ఆఫీసుకొచ్చాక ఎంత సేపు ఏడ్చాడో?
మధ్యాహ్నం అన్నం తిన్నాడో లేదో? బాగా ఏడ్చి విసిగిస్తున్నాడని అవ్వ మరింత విసుక్కొందేమో? తనూవిసుగేసి రెండు కొట్టిందేమో? ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోతే నిద్రపోయాడేమో?
పీడ విరగడయిందని తనూ నిద్రపోయిందేమో? ఎప్పటికో తెప్పరిల్లుకొని “దాహం” అనడిగితే ఆ నిద్రలోనే వాడిని కసిరిందేమో?
బాబొక్కడే నిద్రలేచి “అమ్మా మంచి నీళ్ళమ్మా” అని ఇల్లంతా తిరిగాడేమో?
ఒక్కో ప్రశ్నా ఒక్కో ప్రశ్నా వేసుకొంటున్న కొద్దీ గుండెలోని బరువంతా కాళ్లలోకి వచ్చేసినట్టు అడుగులు మరింత తడబడుతున్నాయి.
పొద్దున్న కోపంతో అన్నం తినకుండా బయల్దేరిపోయాను. మధ్యాహ్నం లంచవర్లో తినబుద్ధి గాక మానేశాను. ఆ బరువుని మొయ్యలేనంటున్నాయి నీరసంగా ఉన్న కాళ్ళు అసలెందుకంత కోపం వచ్చింది నాకు?
అది కోపం కాదు నిస్సహాయత… నిస్సహాయతా కాదు… ఉక్రోషం… ఉక్రోషమూ కాదు దు:ఖం…
పొద్దున్నే పక్కింటి అబ్బాయి ఓ కాడ్బరీస్ చాక్లెట్ తెచ్చుకొని బాబెదురుగా నిల్చొని తింటుంటే ఆశగా చూశాడు బాబు.
“అమ్మా నాకూ అటువంటి కాడ్బరీ చాక్లెట్ కావాలి” అని పేచీ పెట్టాడు.
పర్సులో ఉన్న ఆఖరి పది రూపాయల నోటు కూడా నిన్నటితో ఖర్చయిపోయింది. పర్సులో బస్సులో వెళ్ళడానికి సరిపడా చిల్లర డబ్బులున్నాయంతే!
“ఇవాళ జీతాలొస్తాయిగా! బోల్డుడబ్బులొస్తాయి. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఒకటి కాదు రెండు కొనితెస్తాను. ఏం?” అన్నాను.
ఊహూ వినడే!
బాబెదురుగానే ఆ అబ్బాయి అలా లొట్టలేసుకొని తింటుంటే బాబు నోట్లోంచి ఊరుతున్న లాలాజలాన్నీ… కళ్ళలోంచి ఉబుకుతున్న ఆశను చూస్తుంటే కన్నీళ్ళు దాచుకోవడం ఎంత కష్టమయిందో!
ఎంత చెప్పినా వినకుండా ఏడుపు లంకించుకొన్నాడు…కాళ్లు తపతపా కొట్టుకొన్నాడు… అన్నప్పళ్ళాన్ని దూరంగా తోసేశాడు… స్నానానికి రానని మొండి కేశాడు…
ఉక్రోషం, నిస్సహాయత, దు:ఖం కలగలసిన భావం మనసుని ఉక్కిరిబిక్కిరి చేయగా నా బతుకుమీద నాకే అసహ్యం పుట్టగా ఎవరిమీదో కసితీర్చుకొంటున్నట్టు బాబు చెంపమీద చెళ్ళుమని కొట్టి బాబు ఏడుస్తున్న ఏడుపుని కూడా పట్టించుకోకుండా వచ్చేశాను.
ఫలితం ఎనిమిది గంటల నరకయాతన….. కానీ.. అనుకొన్నట్టు జీతాలొచ్చేసుంటే బాబుకి ఓ రెండు కాడ్బరీలు కొని తీసికెళ్ళుంటే ఈ చిత్ర హింస కొద్దిగానైనా తగ్గేదేమో!
కానీ మామూలే! ఈ రోజూ జీతాల్లేవు. రేపు తప్పకుండా ఇస్తారట. అప్పుకొసం చెయ్యి చాచక తప్పలేదు.
ఈ రోజు తప్పక జీతాలిస్తారని పర్సులోని ఆఖరినోటుని కూడా ఖర్చు పెట్టేసుకొని వచ్చిన నాలాంటి వారే అందరూనూ!
అందరివీ చాలీచాలని బతుకులే!
ఎలాగోలా అయిదు రూపాయలు దొరికాయి. ఆ అయిదు రూపాయిల్లోనూ బస్సుకి రూపాయి పోనూ మిగిలినవి నాలుగు! వేస్తున్న అడుగులు ఆగిపోయాయి…
ఎదురుగా ద్వారకా ఎంపోరియం అని మెరుస్తున్న అక్షరాలతో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరు… ముందున్న కౌంటరు మీద పెట్టిన సీసాల్లో రకరకాల చాక్లెట్లూ, బిస్కెట్లూ!
ఆ పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరుకి పక్కనే ఓ చిన్న జంగిడీ… ఆ జంగిడీ నిండా పెసరపణుకులు… ఆ పుణుకుల మీద ముసురుతున్న ఈగల్ని చేతిలోని మురికి గుడ్డతో తోలుతూ ఓ ముసలమ్మ…
ముసలమ్మనీ. ఆ జంగిడీనీ, దానిముందు నిల్చొని అవ్వ ఆకుల్లో పెట్టి ఇచ్చిన పుణుకుల్ని ఆబగా తింటున్న మనుషుల్నీ రోజూ చూస్తూనే ఉంటాను…
ఆ జంగిడీని దాటుకొని ద్వారకా ఎంపోరియం ఉన్న వైపు నుండి రెండు కళ్ళు దీనంగా ఆ జంగిడీలోని పుణుకుల వైపు చూస్తున్నాయి… ఆ కళ్ళల్లో అదే ఆశ… ఆ చూపుల్లో అదే దీనత్వం… ఆ నోట్లో అదే లాలాజలం…
పొద్దున్న పక్కింటి అబ్బాయి కాడ్బరీ చాక్లెట్ తింటున్నప్పుడు బాబు చూపులకి ప్రతి బింబం లాగున్నాయి ఆ చూపులు!
రెండడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగి చూశాను.
పుణుకుల మీంచి చూపు తిప్పి ఒంగొని నేలమీద ఏదో వెతుకుతోంది ఆ పాప. చిరిగి వెలసిపోయి ఒదులొదులుగా వేలాడుతున్న గౌను… చింపిరి తల… మట్టిపట్టిన ఒళ్ళు… పుల్లల్లాంటి చేతులూ కాళ్ళూ… లోతుకుపోయిన బుగ్గలూ…

కిందకొంగి ఏదో వెతుకుతున్న ఆపిల్లవైపే అలా చూస్తుండిపోయాను కాస్సేపు. నిండా పదేళ్ళు కూడా ఉన్నట్టు లేవు. మరి ముందుకడుగెయ్య బుద్ధిపుట్టలేదు. వెనక్కు తిరిగి ఆ పిల్ల దగ్గరకు నడిచి అడిగాను.
“ఏయ్ పిల్లా ఏంటి వెతుకుతున్నావ్?”
“రూపాయి… రూపాయి బిళ్ళ ఈడ ఏడనో పడిపోనాదండీ…” చాలా సేపట్నుంచి వెతుకుతున్నట్లుంది, ఆ గొంతులో చెప్పలేనంత నీరసం…
నా మనస్సు కలుక్కుమంది.
“పుణుకులు కొనుక్కోడానికి వచ్చావా?” అడిగాను.
అవునన్నట్టు తల ఊపింది.
“రూపాయి పోయింది కదా… పోనీ ఇంటి కెళ్ళి అమ్మనడిగి ఇంకో రూపాయి తెచ్చుకోకూడదూ?”
జాలిగా చూసిందాపిల్ల. “అమ్మ సిన్నపుడే సచ్చిపోనాదండీ. అయ్యనడిగితే ఇత్తాడుగానీ పిన్ని కొట్టుద్దండీ” గౌనుని ఒక చేత్తో మెలిపెడుతూ ఆగిఆగి చెప్పింది.
“మరి ఈ రూపాయి నీకెవరిచ్చారూ?” అనుమానంగా అడిగాను.
“పొద్దుటేల బస్టాండుకాడ ఎవరివో సామాను కూసింత దూరం మోసుకెళ్తే రూపాయి ఇచ్చారండీ. సాయంత్రం పుణుకులు కొనుక్కోచ్చు కదా అని గౌనుకి కట్టుకుని దాచుకొన్నానండి. ఇక్కడికి వచ్చేదాకా ఉందండీ. పుణుకులు కొనుక్కొందామని చూసేసరికి కనపళ్ళేదండీ. ఇక్కడే ఎక్కడో పడిపోయినట్టుందండి.” గబగబా చెప్పేసి మళ్ళా ఒంగొని వెతకసాగింది.
“ఎంతసేపట్నుంచి వెతుకుతున్నావ్?” అడిగాను.
“మద్దేనం కూసింత ఎండవుండగానే వచ్చానండి” అంది.
అంటే రెండు మూడు గంటల్నుంచి అక్కడే అలాగే కింద పడిపోయిన ఆ రూపాయి బిళ్ళ గురించి వెతుకుతోందా? ఉండలా గొంతుకడ్డుపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాధ మరింత ఎక్కువయింది…
ఒక్కరూపాయి… కేవలం ఒక్కరూపాయి… నా దగ్గరున్ననాలుగురూపాయల్లోంచి ఒక్క రూపాయి తీసి ఇచ్చేస్తే?
అమ్మో! మిగిలిన మూడు రూపాయల్లో బాబుకి కాడ్బరీ కొనేస్తేబస్సుక్కూడా డబ్బులు మిగలవ్.
నెమ్మదిగా వెనక్కు తిరిగాను. ఈ సారి అడుగులు మరింత బరువయ్యాయి అయినా నేనింత బాధపడిపోవడమెందుకు? ఆ పిల్ల డబ్బులు పోయాయని అబద్ధం చెబుతూందేమో? మూటలు మోశానని అబద్ధం చెబుతూందేమో? రెండడుగులు ముందుకు వేశాను…
ఊహూ! ఆ మాటల్లో అబద్ధం ఉందేమో గాని ఆ మొహంలోని ఆకలి అబద్ధంకాదు… ఆ చూపుల్లోని నిరాశ అబద్ధం కాదు… నోటి లోంచి ఊరుతున్న తడి అబద్ధం కాదు…
మరో రెండడుగులు వేశాను. అయినా నేను మాత్రం ఏం చేయగలను?
ఆచిన్న కాడ్బరీ చాక్లేట్ని బాబు చేతిలో పెట్టి ఆ చిన్న బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తే గాని గుండెలో మంటలు చల్లారవు.
మరో రెండడుగులు వేశాను. బాబు ఏడిస్తే ఎప్పటికైనా సరే కన్నీళ్ళు తుడిచి బుగ్గమీద ఓ ముద్దియ్యడానికి ఓ అమ్ముంది. ఇవాళ కాకపోయినా రేపైనా తను ఆశపడిన వస్తువు తినడానికి అవకాశముంది. కాని ఆ పాపకి..? ఓ నాలుగు పెసర పుణుకులు తినాలంటే నాలుగు కిలోల బరువు మోయాలి… కళ్ళంట నీళ్ళెట్టుకుంటే తుడిచే చెయ్యిలేదు. చెంప ఛెళ్ళుమనిపించే చెయ్యే ఉంది.
మరో రెండడుగులు వేశాను. బాబుకి మూడు రూపాయల ఆ ఖరీదైన చాక్లేటే కొనక్కర్లేదు. ఓ రూపాయి పెట్టి చిన్నది కొని మరిపింతలు పెట్టోచ్చు.
కానీ ఆ పాపకి అలా ఎవరు మరిపింతలు పెడతారు?
ఏ అర్ధరాత్రి దాకానో ఎక్కడో పడిపోయిన ఆ రూపాయి బిళ్ళ గురించి వెతికి వెతికి ఆపుకొంటున్న వెక్కిళ్ళతో ఇంటి దారి పడుతుందేమో?
అడుగులు మరి ముందుకు పడలేదు. గిరుక్కున వెనక్కు తిరిగాను. తిన్నగా ఆ పాపదగ్గరికి నడిచి చేతిలోని పర్సు తెరిచి అందులోని నాలుగు రూపాయి నోట్లలోంచి ఓ నోటు తీసి గబగబా ఆ పాప చేతిలో పెట్టేశాను ఆలస్యమయితే మనస్సు ఎక్కడ మారిపోతుందోనన్న ఆత్రంతో.
మరో మూడు నిమిషాలకల్లా పావ చేతిలో ఆకులో కట్టిన నాలుగు పెసరపుణుకులున్నాయి… వాటిని చూడగానే ఆ పాప కళ్ళు తళుక్కున మెరిశాయి… నేను చూస్తుండగానే పెదవులు తడయ్యాయి… ఎంతో అపురూపంగా పొట్లాన్ని పట్టుకొని ముందుకు నడిచిందా పాప.
“అదేంటి పుణుకులు తినవూ?” ఆత్రంగా అడిగాను.
ఒక్కసారి నా మోహం వైపు ఆ తరువాత చేతిలోని పొట్లాం వైపు ప్రేమగా చూసిందాపిల్ల.. ఆ తర్వాత నెమ్మదిగా అంది…
“ఇయ్యి … ఇయ్యి.. నా గురించి కాదండీ… ఇంట్లో మా తమ్ముడున్నాడు… సిన్నోడు… ఆడికిట్టాంటివి నేను కొనియ్యక పోతే ఎవరిస్తారు?” అలా అంటూనే ఆ పొట్లాన్ని భద్రంగా గౌన్లో చుట్టేసి ముందుకు నడిచిపోయింది. నిశ్చేష్టురాలినై చూస్తుండిపోయాను.
గొంతులో ఉండలా అడ్డుపడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బాధ కరిగిపోయి కళ్ళలోంచి బయటకుబికింది. ఇంట్లోని నా బాబు రూపం వెళ్ళిపోతున్న ఆ పాప రూపంలో కరిగిపోయి కలిసిపోయినట్టనిపించిందో క్షణం. కన్నీళ్ళ తడిలో మసకబారిన కళ్లకి ఆ పాప వేస్తున్న ఒక్కో అడుగూ “నీలాలుగారితే నే చూడలేనూ… పాలైనా కారవే బంగారు కళ్ళూ.” అన్న పాటలోని ఒక్కో చరణంలా వినిపించింది.
చాలీచాలని చిరుగుల దుప్పటికో చిన్న మాసికలా!

 

Share Button

డెత్! ది లెవెలర్!(Death the leveller)

Share Button

 

                                                      డెత్! ది లెవెలర్!
                                         (18-10-1974, ఆంధ్రజ్యోతి)


వర్షం! వర్షం!
ఆకాశానికీ, భూమికీ మధ్య నీరుతప్ప మరేమీ లేనట్లు ఏకధారగా వర్షం!
ప్రపంచాన్నంతటినీ ముంచేయాలన్నంత ఆత్రంగా కురుస్తోంది వర్షం! నట్టనడి సముద్రంలో… ఉధృతమైన తుఫాన్లో ఒంటరిగా పయనించే పడవలాగుంది ఆ ఇల్లు.
పెచ్చులూడిపోయిన గోడలు… అక్కడక్కడ విరిగిపోయిన పెంకులు… మృత్యుదేవత కబళించబోయే ముసలిదానిలా ఉందా ఇల్లు!
మనుష్యులు ఆ ఇంటిని వెలివేసి కొన్ని పదుల సంవత్సరాలు దాటాయని ఆ ఇంటి ముందు పిచ్చిగా పెరిగిన ముళ్ళమొక్కలే చెపుతున్నాయి. ఆ ఇంట్లో… ఆ గదిలో… ఆ ముగ్గురు…
మిట్ట మధ్యాహ్నం రెండుగంటల సమయం. కానీ ఆ గదిలో చీకటి. బయటనుండి వచ్చిన వారికి ఆ ముగ్గురూ గాలిలో తేలిపోతున్న నీడల్లా కనిపిస్తారు.
కత్తి ఝుళిపించినట్లు మెరుపు మెరిసింది. ఆ ఒక్క క్షణంలో ముగ్గురూ ఒకరి నొకరు నిశితంగా చూసుకొన్నారు.
ఆ చూపుల్లో భయం… ఏదో చెప్పాలన్న ఆతృత… నిరాశ…విసుగు… ఎన్నో కలగా పులగ మయిపోయాయి.
మెరుపుతోబాటు ఉరుము!
ఏదో అదృశ్యహస్తం ఆకాశాన్నీ భూమినీ పిడికిట్లో బంధించి పటపటమని విరిచేస్తున్నట్లు శబ్దం!
ఆ చప్పడుతో ఆ ముగ్గురితో పాటు ఆ ఇల్లు, ఆ ఇంటిముందున్న మర్రిచెట్టు అదిరి పోయాయి.
ఆ ముగుర్లో మూలనున్న కిటికీలో రుమాలు పరుచుకొని దాని మీద ఠీవిగా కూర్చొన్నతని పేరు లక్ష్మీపతి. ఖరీదైన సూటు, చేతికున్న వజ్రపుపొడి ఉంగరం, చీకట్లో మెరుస్తున్న రేడియం డయల్ వాచి సమాజంలో అతనికున్న స్థానాన్ని తెలుపకనే తెలుపుతున్నాయి. కాని ప్రస్తుతం ఆ గదిలో… ఆ వర్షంలో… అతని విలువ ఒక మనిషిగా మాత్రమే!
అటువైపు మూలకి గోడకి ఆనుకొనీ ఆనుకోనట్లుగా నిలబడి, చేతులు రెండూ వెనక్కు పెట్టుకొని వర్షంలోకి తదేకంగా చూస్తున్నతని పేరు సుబ్బారావు. అతని కళ్ళు వర్షం వైపు చూస్తున్నా ఆ చూపులు వర్షపు ధారలను చీల్చుకొని ఏ దూర తీరాలకో చొచ్చుకుపోతున్నాయి. వేసుకొన్న నీలంరంగు పేంటుకి ఒక చిరుగు కనపడకుండా కుట్టిఉంది. కాళ్ళకున్న చెప్పలు సగం అరిగిపోయి వాటి వయస్సుని దీనంగా చాటి చెపుతున్నాయి. సమాజంలో అతన్ని మధ్య తరగతి కుటుంబీకుడంటారు.
సరిగ్గా ఆ గదిలో ద్వారాని కెదురుగా మోకాళ్ళలో తలదూర్చుకొని కదలిక అనేది లేకుండా కూర్చున్నతని పేరు ఎల్లయ్య. ఎవరైనా అతన్ని అలా చూస్తే వెక్కివెక్కి ఏడుస్తున్నాడనుకొనే అవకాశాలున్నాయి. కానీ అతనేడవక పోయినా మనస్సులో కూడా బయటలాగే తుఫాను రేగుతోందని అతని కళ్ళలోకి చూసిన వారికి తెలిసి పోతుంది. అతను కట్టుకొన్న గోచీ మోకాళ్ళ పైకి ఉంది. పైన ఒక చిన్న తుండుగుడ్డ తప్ప మరే ఆఛ్ఛాదనా లేదు. శరీరం మీద అక్కడక్కడ నీటి బొట్లు మెరుపు మెరిసినప్పడల్లా తళుక్కుమంటున్నాయి. కార్లలో తిరిగే పెద్ద మనుష్యులు అతనికి ముద్దుగా పెట్టిన పేరు అలగా జాతివాడు.
“ధనాధన్. ధన్ ధన్ ధన్” భూమి గిరగిరా తిరుగుతూ వెళ్ళి ఏదో గ్రహానికి గుద్దుకొన్నంత చప్పుడు. ముగ్గురూ ఉలిక్కిపడ్డారు.
లక్ష్మీపతి కిటికీలోంచి లేచాడు. ఒకడుగు ముందుకు వేశాడు. సుబ్బారావు వైపు చూశాడు.సుబ్బారావు వర్షంలోంచిచూపు మరల్చి లక్ష్మీపతివైపు చూడబోయి, చటుక్కున చూపు తిప్పేసి ఎల్లయ్య వైపు చూశాడు.
ఉరుము ఉరమగానే ఉలిక్కిపడిన ఎల్లయ్య మోకాళ్ళలో దూర్చిన తలను చటుక్కున పైకెత్తి ఎర్రటి కళ్ళతో ఇద్దరివైపు నిశితంగా ఒక్క క్షణం చూసి మళ్ళా తలవంచేసుకున్నాడు.
ముగ్గురికీ ఏదో చెప్పాలన్న ఆతృత. ఇంకొకరికి దగ్గరవుదామన్న కోరిక. కాని అలా చెయ్యలేని ఆశక్తత!
లక్ష్మీపతికి సుబ్బారావు స్థితిని చూస్తే చులకన. ఎల్లయ్య కండబలాన్ని చూస్తే భయం.
సుబ్బారావుకి లక్ష్మీపతి ఖరీదుని చూస్తే కసి. ఎల్లయ్య వేషాన్ని చూస్తే అసహ్యం. ఎల్లయ్యకు లక్ష్మిపతి మొహాన్ని చూస్తే భయం. సుబ్బారావు దుస్తుల్ని చూస్తే అసూయ!
ఆపద వచ్చినప్పడు పామూ, మనిషీ కూడా ఏకమవుతారన్న వాడెవడో?
నిజమే పామునీ, మనిషినీ ఏకం చేసిన పరిస్థితులు కూడా మనిషికీ మనిషికీ మధ్యనున్న అంతస్థుల గోడల్ని ఛేదించలేవేమో!
కుండపోతగా కురిసే వర్షంలో. ఆ పాడుబడిన ఇంట్లో తలదాచుకొన్న…. ఆ ముగ్గురికీ అప్పుడూ అంతస్తుల గోడలు అడ్డొచ్చాయంటే ఆ మనుష్యుల్ని సృష్టించిన దేముడే పైనించి చూసి ఫక్కుమని నవ్వుకొంటాడేమో!
**** ***** **** **** **** **** **** **** **** **** **** **** ***
లక్ష్మీపతి మళ్ళీ కిటికీలో సర్దుకొని కూర్చున్నాడు. బయట స్కూటరు తడిసి ముద్దయిపోతోంది.
“ప్చ్ ! ఒక్క పావుగంట ముందు బయల్దేరినా హాయిగా ఈ సరికి ఆ ఇంట్లో ఉండేవాడిని” అనుకొన్నాడు సున్నితంగా మొహంమీది తడిని అద్దుకొంటూ. చూసీచూడనట్లు మిగిలిన ఇద్దరివైపూ చూశాడు.
“వారిద్దరితో కలిసి ఉన్న ఆ పాడు పడిన ఇల్లు అతనికి నరక కూపంలా కనిపించింది. వారిద్దరికీ బదులు తన అరుణే ఇక్కడుంటే ఓహ్! అది స్వర్గమే కాదూ ! అవును. బయట వెండి తీగల్లా వర్షపు ధారలు. లోపల ఒంటికి అతుక్కుపోయిన బట్టల్లో గులాబీ లాంటి మొహం మీద నిల్చిన నీటి బిందువుల్తో తన కౌగిట్లో ఒదిగిపోయిన అరుణ!
లోపల సెగలు రగిలించే వేడి. బయట జివ్వుమనిపించే చలి. “అబ్బా ఏం చేస్తున్నావరుణా ! తెల్లని ఉల్లి పొరలాటి చీరలో మెత్తని పరుపు మీద అలవోకగా పడుక్కొని వర్షపు ధారలవైపు పరధ్యానంగా చూస్తున్నావా? ఎప్పటికీ రాని నీ ప్రియుని మీది అలుకతో నీ అందాల పాదాలు కందిపోయేటట్టు పచార్లు చేస్తున్నావా?ఉహూC. ఒద్దు నిరీక్షణలో అలసిన నీ మొహాన్ని చూడలేను … వచ్చేయ్ అరుణా! ఇక్కడి కొచ్చేయ్! మై హనీ! మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్” !.
**** ***** **** **** **** **** **** **** **** **** *** ****
సుబ్బారావు తాను నిల్చొన్న దగ్గర్నుండి రెండడుగులు ముందుకు వేసి బయటకు చూశాడు. గాలివానకి అక్కడున్న సైకిల్ ఎప్పడో తిరగబడిపోయినట్లుంది. అద్దె సైకిల్ కూడానూ. ఏదైనా పాడయితే పీకల మీద కూర్చొంటాడు వెధవ …పోనీ కిందికి దిగివెళ్ళి తెచ్చేస్తే?. కాని ఈ ఈదురు గాలిలో పదిమెట్ల పైకి ఎక్కించి తీసుకురావడం సాధ్యమా? నిర్లిప్తంగా వెనక్కువచ్చి తన స్థానంలో నిల్చొన్నాడు.
ఇంట్లో జానకి ఏం చేస్తోందో ఇవాళే పథ్యం తింది కూడానూ. మళ్ళా ఈ వర్షానికి ఏమైనా వస్తే!. చూరులోంచి కారే నీళ్ళధారలకింద బిందెలూ, గిన్నెలూ పెడుతూ నీరసంగా చేయలేక చేయలేక చేస్తున్న పన్లకి అడ్డం వస్తున్న పిల్లవెధవల్ని దబ దబా బాదేస్తూ…ప్చ్!
“ఒద్దు జానకీ. ఒద్దు అలా విసుగ్గా చూడకు. నీ కళ్ళలో ఆ నిరాశని, విసుగుని భరించే శక్తి నాకు లేదు.
లేదు జానకీ! తప్పంతా నాదే! మూడు రోజులు జ్వరంతో పడిఉన్న పెళ్ళానికి లంఖణాన్నే ఔషధంగా ఇవ్వగలిగాను. నా పిచ్చి జానకీ! ఇక్కడి కొచ్చేయ్. ఇక్కడ కూడా పైనుంచినీళ్ళు కారుతున్నాయి. కాని ఆ పాడు ప్రపంచానికి దూరంగా మనమంతా హాయిగా పడుకోవచ్చు. వచ్చేయ్!”
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
ఎల్లయ్య ఏదో గుర్తొచ్చినవాడిలా లేచి నిల్చొని ద్వారందాకా వెళ్ళి బయటకు చూపుసారించాడు. వర్షంలో జలకాలాడుతూ నిశ్చలంగా నిలిచిఉంది సైకిల్ రిక్షా!
“ఇయాల అద్దెడబ్బులన్నా కిట్టయేమో! ఏం బతుకులో మాయదారి బతుకులు. పూట తిండిక్కూడా గతిలేని మాలాటోళ్ళని చూస్తే ఆ బగమంతుడిక్కూడా లోకువే. అతని కళ్ళలో లచ్చిరూపు మెదిలింది. . ఈ వర్షంలో ఎలాగుందో ఏం చేస్తోందో వర్షంలో తడిసిపోతూ . కాళ్ళకు అడ్డం పడుతున్న చీరనూ. చంకలో జారిపోతున్న బిడ్డనూ సవరించుకొంటూ పరిగెడుతున్న లచ్చి! ఏదో ఇంటి అరుగుమీద. సగం తడిసిపోతూ.. పసివాడిని గుండెలకు హత్తుకొని కళ్ళలో నీటిబొట్లతో ముడుచుకు కూర్చొన్న లచ్చి!
“లచ్చీ నా లచ్చీ? ఏం చేతున్నావే! నువ్వాడ .నేనేమో ఈడ! మన దౌర్బాగ్గిపు బతుకులు చూసి ఎకెక్కి ఏడుత్తున్నావా? ఒద్దు లచ్చీ అలా ఏడవమాకు. నీకు తెల్దా. నీ ఒక్కో కన్నీటిబొట్టు నా గుండెల్లో ఒక్కొక్క గునపంగా దిగుతాదని! రాయే లచ్చీ. నాకు నీవు .నేను నీకు. ఇంకేటీ ఒద్దు రాయే!
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
సెకండ్లు నిమిషాలుగా … నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయ్. కాని వారి ముగ్గురికి మాత్రం కాలం స్థంభించింది. చలికి ఆ ముగ్గురూ ఒణుకుతున్నారు. ఒణుకుతున్నవారిని చూసి ఆ ఇల్లు కూడా భయంతో ఒణుకుతోంది. ఆ చీకటి ఇంట్లో తలదాచుకొన్న ఆ మానవుల్ని చూసి వెర్రిగా నవ్వుతున్నట్లు విపరీతంగా ఊగుతోంది మర్రిచెట్టు. ఆ మర్రిచెట్టు ఊడలు ఎప్పడెప్పడు తమని కబళిద్దామా అని చూస్తున్న మృత్యుదేవత కబంధ హస్తాల్లా ఉన్నాయి.
లక్ష్మీపతి మనస్సులో కోరికలు బుసలు కొడుతున్నాయి.
సుబ్బారావు మనస్సులో నిరాశ నిద్ర తీస్తోంది.
ఎల్లయ్య మనస్సులో దు:ఖం కట్టలు తెంచుకొంటోంది.
కాని ముగ్గురు మనుష్యుల్లోనూ అట్టడుగున దాగివున్న భయం అప్పడప్పుడు నిద్రలేచి వికటహాసం చేస్తోంది.
లక్ష్మీపతికి అందమైన అరుణతోబాటు నిన్నటి సంఘటన కూడా గుర్తొచ్చింది.
“పతీ ఒక విషయం అడగనా!”
“అడుగు డార్లింగ్”.
“నా సర్వస్వాన్ని నీకర్పించాను. కాని అప్పడప్పుడు నువ్విచ్చే బహుమతులు తప్ప నాకై నేను నోరు విడిచి ఏదీ అడగలేదు. అవునా?”
“చెప్పరుణా ఈ అందచందాలన్నీ నావి కావడానికి ఏమైనా ఇచ్చేస్తాను.”
“నాకు తెలుసు పతీ నేనడిగింది కాదనవని . ఎందరికో నా శరీరాన్ని అర్పించినా వాళ్ళిచ్చిన డబ్బు నాకు తృణప్రాయం తెలుసా! నీ చేత్తో నేను కోరే ఈ చిన్న బహుమతి ఇస్తే నేనెప్పటికీ నీదాన్నే! ఈ శరీరాన్ని ఇంకొకరు తాకరు!”
“ఇంక ఆ ఊరింపు చాలించి చెప్పు!”
“వీరభద్రయ్యగారి ఇల్లు అమ్మకానికొచ్చిందని నీకూ తెలుసుగా! ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది అటువంటి ఇంట్లో ఉండాలని. చుట్టూ కాంపౌండ్, ముందొక గారేజ్. అటాచ్ బాత్రూం. చాలా బాగుందిలే నేనూ చూశా!”
“ఎంతుంటుందో”
“నలభైవేలట! వెధవ ఆ నలభై వేలు నీకు లెక్కలోనివి కావని తెలుసు”
“ఏమిటాలోచిస్తున్నావ్ పతీ! ఆ ఇంటిని ఎంత త్వరలో కొనేసి నన్ను ఆశ్చర్యంలో ముంచేద్దామా అని కదూ!”
“అంత పరధ్యానంగా ఉండకు మరి! కమాన్ ముందుగా డ్రింక్ తీసుకో!” లక్ష్మీపతి ఆలోచనల్లోంచీ తేరుకొన్నాడు.
“అవును ఆ ఇల్లు కొనాలి. ఊరంతటినీ ఊరించిన చిలకని శాశ్వతంగా తన గూట్లోనే బంధించాలి.”
లక్ష్మీపతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.
రేపు . అతనికి రంగురంగుల ఇంద్ర ధనుస్సులా కనిపించింది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
సుబ్బారావుకి విసుగ్గా కోపంగా ఉన్న జానకి ముఖం కళ్ళ ముందు నిలిచింది. ఆ వెనకే నిన్నటి సంఘటన కూడా. “అబ్బబ్బ వెధవ ఇల్లు . వెధవ పిల్లలు. ఛస్తున్నాను చాకిరీ చెయ్యలేక!”
“ఏమిటే నీ గొణుగుడు ఆఫీస్ నుంచి వచ్చిన ప్రాణాన్ని హాయిగా వుండనీయక”
“అవునవును. మీరు హాయిగా ఆ కుర్చీలో అలాగే కూర్చోండి. నేనేమో అరమైలు దూరం నుండి నీళ్ళు మోసుకొస్తూ. ఆ బిందెడు నీళ్ళక్కూడా అడ్డమైన వాళ్ళచేత తిట్ల తింటూ.. ఛీఛీ! ఈ బతుకు బతికేకంటే ఆ నూతిలో పడి ఛస్తే మీకు నాబాధ. నాకు మీ బాధ తప్పుతాయి”
“నోర్ముయ్యవే! మాట్లాడితే ఛస్తాను ఛస్తాను అంటూ.. ఇంట్లోవున్న ఈ నాలుగ్గంటలైనా హాయిగా వుండనీయకుండా.”
“అవునవును మీకే కావాలి హాయి. మీ పెళ్ళాని కక్కర్లేదు. వెధవది స్నానాలు చేయ్యాలంటే బాత్రూం ముందు గంటలకొద్ది పడిగాపులు . దెబ్బలాటలు. చేతులు పడిపోయేటట్లు నీళ్ళు తోడుకోవాలి. పదిమంది కుటుంబాలకు ఒక్క బావి! వీటన్నిటితోనూ నేను ఇరవై నాలుగ్గంటలూ చావాలి. కాని తమరు మాత్రం మహారాజులా కాలుమీద కాలేసుకు కూర్చోవాలి!”
“అబ్బబ్బాఏం చేయమంటావే నన్ను? రేపటినుంచి బిందెల్లో నీళ్లు మోసుకురానా, బావిలోంచి నీళ్ళు తోడిపెట్టనా!”
“మీరవేమీ చెయ్యక్కర్లే. ఇంత కంటే మంచి కొంపొకటి చూసి పెట్టండిచాలు. అక్కడెక్కడో లక్ష్మీటాకీస్ దగ్గర ఓ ఇల్లు ఖాళీ అయ్యిందట. ఇంట్లోనే ఓ కొళాయి, బాత్రూము ఉన్నాయట. ఈ దరిద్రపు కొంప పీడ విరగడయితే చాలు. పది రూపాయలద్దె ఎక్కువైతే నేం. రోజూ ఛస్తూ బతికేకంటే నయం కాదూ!”
“సరేలేవే రేపే వెళ్ళి కనుక్కుంటాన్లే”
ఈ లోకంలోకి మళ్ళా వచ్చాడు సుబ్బారావు. “ఈ వానింకా తగ్గలేదు. ఈ పాటికి ఇంకెవరైనా మాట్లాడేసి అడ్వాన్సు ఇచ్చేశారేమో! “ఈ వర్షం వల్ల ఆ ఇల్లు కూడా దక్కేట్టులేదు.”
సుబ్బారావు దీర్ఘంగా నిట్టూర్చాడు. రేపు… అతనికి మబ్బులు కమ్మిన ఆకాశంలా కనిపించింది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** ***
లచ్చి అమాయికమైన మొహం ఎల్లయ్యకు నిన్నటి సంఘటన గుర్తుకు తెచ్చింది.
“మావా!” లచ్చి తన గుండెల్లో తలపెట్టి భోరున ఏడుస్తోంది.
“ఎట్టా మావా! నిన్నటిదాకా వుండడానికి ఒక గూడన్నా వుండేది. ఇప్పడు అదీ లేదు. ఆ వానదేముడిక్కూడా మనమంటే ఏలాకోలమే మావా! లేకపోతే మన గుడిసెనే కూల్చెయ్యాలా… సెప్పు ఛీ మాయదారి దేవుడు.”
“తప్పే లచ్చీ ఆ భగవంతుడ్ని తిట్టమాకే .. మన కర్మకాలి మన గుడిసె కూల్తే ఆ దేవుడేం చేత్తాడే … ఊరుకోయే… ఊరుకో… ఏడవమాక!”
“ఏడవక ఏం సెయ్యనుమావా! ఈ బొట్టడ్ని సూడు… మనిద్దరమైతే ఎండలో ఎండుతాం… వానలో తడుత్తాం… ఇంకా కళ్ళైనా సరిగ్గా తెరవనేదు. ఈడి కెట్టామావా!”
“ఆ దేవుడే మనకు దారి చూపిత్తాడులెయ్యే! ఆ లచ్చయ్యని వంద రూపాయలు
అప్పు అడుగుతా… ఈ రిచ్చాలో బొట్టడ్ని పడుకోబెట్టు… రెండు రోజుల్లో గుడిసె ఏసుకుందాం.”
వానధారల్లా పడుతూనే వుంది… ఎల్లయ్యని ఆలోకంలోంచి ఈ లోకంలోకి లాక్కొచ్చింది.
“ఆ లచ్చయ్య డబ్బిత్తాడో ఇయ్యడో…ఎన్ని తిప్పలు పెడతాడో… ప్చ్! మా లాటోళ్ల బతుకులింతే.”
ఎల్లయ్య కంటిలోంచి రెండుకన్నీటి బొట్లు జారిపడ్డాయి. రేపు… అతనికి కటిక చీకటి ఆవరించిన కాళరాత్రిలా అనిపించింది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** ****
కాలచక్రం ఆగకుండా తిరుగుతూనే వుంది.
“అబ్బ నాలుగ్గంటలు ఈ ఇంట్లో గడిపాను” అనుకొన్నాడు లక్ష్మీపతి చేతినున్న వాచీ చూసుకొంటూ… చీకట్లో వాచీ కనిపించని సుబ్బారావు లక్ష్మీపతివైపు కసిగా చూశాడు. అసలు టైము చూడడమే రాని ఎల్లయ్య మాత్రం మోకాళ్ళలోంచి తల పైకెత్తలేదు.
గదిలో చీకటి చిక్కబడుతోంది… సూర్యుడు ఎప్పడు పడమటి కొండలచాటుకి వెళ్ళాడో తెలియనంతగా మబ్బులు కమ్మేశాయి… చల్లని చీరచెంగు ముఖం నిండుగా కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆడదానిలా ఉంది ఆకాశం!
వర్షం… కాదు కాదు జడివాన… ఉహూ! తుఫాను! ఇవేమీ కాదు… ఇది ప్రళయం… జలప్రళయం…
ముగ్గురి గుండెల్లోనూ గూడు కట్టుకొన్న భయం ఉబికుబికి బయటకొస్తోంది… నల్లని జుత్తు ముఖాన్నంతా కప్పేసినట్లు చీకటి ఆ గదిని పూర్తిగా ఆక్రమించుకొంది.
లక్ష్మీపతి జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించాడు. ఆ చీకట్లో ఆ నిప్పురవ్వ చిన్న ఆశాకిరణంలా మినుకు మినుకు మంటోంది.
సుబ్బారావు కూడా జేబులో ఉన్న ఒక్కసిగరెట్టూ తీశాడు. కానీ వెంటనే అగ్గిపెట్టెలో పుల్లల్లేవన్న సంగతి గుర్తొచ్చి కసిగా జేబులో పడేశాడు. లక్ష్మీపతిని అగ్గిపుల్ల అడగడానికి సంకోచం. ఎల్లయ్య నడగడానికి అహం అడ్డొచ్చాయి.
ఎల్లయ్య కసలు జేబూలేదు… మొలలో చుట్టపీకా లేదు… హోరు మంటున్న వర్షంలో… ఇంటిచుట్టూ ఉన్న నీటిలో కప్పల బెకబెకలు… యమదూతల కిచకిచ నవ్వుల్లా… ముగ్గురి మనస్సుల్లోనూ ఏదో విచిత్రమైన అనుభూతి…
తామున్న ఈ గది తప్ప మిగతా ప్రపంచమంతా ముక్కలు ముక్కలై నీటిలో తేలిపోతోంది… సూర్యుడు లేడు… చంద్రుడు లేడు… భూమి లేదు… అంతా నీరు… నీరు… నీరు… మామూలు నీరు కాదు… నల్లని చిక్కని నీరు! ఆ నీటిలో తాము ఎక్కడికో తేలిపోతున్నారు. గుండెల నిండా నిండిన ఆ అనుభూతి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
**** ***** **** **** **** **** **** **** **** **** **** **** ***


“ఢాం” భూమి బద్దలయినట్లుగా శబ్దం! కాని అది పిడుగో మరో శబ్దమో తెలుసుకొనే వ్యవధి వారికి లేకపోయింది.
ఎందుకంటే… .
వందల సంవత్సరాల వయస్సున్న ఆ మర్రిచెట్టు తన ప్రాణంతో పాటు వారి ముగ్గురివీ కూడా తీసుకోదల్చి ఆ ఇంటిమీద పడి శాశ్వతంగా విశ్రాంతి తీసుకొంది.
ముందు క్షణం దాకా… లక్ష్మీపతికి చుట్టూ కాంపౌండ్ తో ముందు గారేజ్ తో ఉన్న అందమైన ఇల్లు కావాలి! సుబ్బారావుకి ఒక కొళాయి, ఒక బాత్రూం ఉన్న చిన్న కొంప కావాలి! ఎల్లయ్యకు తల దాచుకొనేందుకు కొక గుడిసె కావాలి! కాని ఈ క్షణం మాత్రం…..
ఒక్కొక్కరికి మూడేసి గజాల చోటు చాలు రేపటి గురించి కలలుగన్నవారికి తెలియని దొక్కటే మృత్యుదేవత దృష్టిలో అందరూ సమానులేనని!
                                                            *********

Share Button